చైనాకు చిప్‌ల స్మగ్లింగ్‌లో జయ్ పురీ భార్య!?
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:44 AM
ఎన్విడియాను చుట్టుముట్టిన వివాదంలో తాజాగా భారత సంతతికి చెందిన మాజీ ఉన్నతాధికారి జయ్ పురీ పేరు తెరపైకి వచ్చింది
మడ్డీ వాటర్స్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ, నవంబరు 19: ఎన్విడియాను చుట్టుముట్టిన వివాదంలో తాజాగా భారత సంతతికి చెందిన మాజీ ఉన్నతాధికారి జయ్ పురీ పేరు తెరపైకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ షార్ట్ సెల్లర్ సంస్థ మడ్డీ వాటర్స్ రిసెర్చ్.. ఎన్విడియా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ (జయ్) పురీకి, చైనా చిప్‌ల అక్రమ తరలింపు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్ మైక్రో మాజీ అధికారిణి సెన్‌లీ చెన్‌కు మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ నెల 17న విడుదల చేసిన ‘ఎన్విడియా: మోర్ చైనా’ నివేదికలో వీటిని ప్రస్తావించింది. ఎన్విడియాలో రెండు దశాబ్దాలుగా పనిచేసిన జయ్ పురీ ఈ ఏడాది జూన్ వర కు ప్రపంచవ్యాప్త కార్యకలాపాల విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సంస్థలో అప్పటి సీఈవో జెన్సన్ హువాంగ్, కోలెట్ క్రెస్ తర్వాత మూడో అత్యున్నత స్థానంలో ఉన్నారు. పురీతో కలిసి 2024-2026 మధ్య పలు బహిరంగ కార్యక్రమాల్లో కనిపించిన మహిళ సెన్‌లీ చెన్ అని, కొన్ని ఫొటోల్లో ఆమెను సెన్‌లీ పురీగా పేర్కొన్నారని మడ్డీ వాటర్స్ తెలిపింది. ఆమె పురీకి భార్య అని కూడా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి