Share News

భారత్‌లో యువతదే పైచేయి!

ABN , Publish Date - Nov 20 , 2026 | 06:30 AM

ప్రపంచ దేశాలన్నీ వృద్ధాప్య భారంతో ఉక్కిరిబిక్కిరవుతుంటే.. భారత్‌ మాత్రం ఉరకలెత్తే యువశక్తితో దూసుకుపోతోంది

భారత్‌లో యువతదే పైచేయి!
youth

  • జనాభా లెక్కల్లో కొత్త రికార్డు.. ప్రతి నలుగురిలో ఒకరు 10-24ఏళ్ల వారే!

  • 147.66కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానం

  • 83శాతం మందికి భవిష్యత్తుపై ఆశ.. 85శాతం మందికి తల్లిదండ్రులు కావాలనే కోరిక

  • యూఎన్‌వో జనాభా నిధి నివేదికలో ఆసక్తికర అంశాలు

న్యూఢిల్లీ, నవంబరు 19: ప్రపంచ దేశాలన్నీ వృద్ధాప్య భారంతో ఉక్కిరిబిక్కిరవుతుంటే.. భారత్‌ మాత్రం ఉరకలెత్తే యువశక్తితో దూసుకుపోతోంది. 147.66 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానం నిలిచిన మన దేశంలో.. ప్రతి నలుగురిలో ఒకరు (26శాతం) 10నుంచి 24ఏళ్ల వారే కాగా, దేశ జనాభాలో 69శాతం మంది 15-64 ఏళ్ల మధ్య వయసు వాళ్లే ఉండటం గమనార్హం. 65 ఏళ్ల పైబడిన వారు 8శాతం మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్‌ ఎఫ్‌పీఏ) గురువారం విడుదల చేసిన ‘స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పాపులేషన్‌- 2026’ నివేదిక ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 141.29 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో ఉండగా.. ప్రస్తుత వృద్ధి రేటు ప్రకారం భారత జనాభా రెట్టింపు కావడానికి 81 సంవత్సరాలు పడుతుందని నివేదిక పేర్కొంది. భారతీయుల్లో కుటుంబ విలువలు, తల్లిదండ్రులు కావాలనే ఆకాంక్ష బలంగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. 35-39 ఏళ్ల వయసుండి పిల్లలు లేని వారిలో దాదాపు 85శాతం మంది తల్లిదండ్రులు కావాలని కోరుకుంటుండగా, 18- 39ఏళ్ల మహిళలు ఇద్దరు పిల్లలు ఉంటే ‘ఆదర్శ కుటుంబం’ అని అభిప్రాయపడ్డారు. ప్రసూతి మరణాల రేటు లక్ష జననాలకు 87కు తగ్గాయి. యూఎన్‌ ఎఫ్‌పీఏ నిర్వహించిన గ్లోబల్‌ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 83శాతం మంది తమ భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉన్నారని డెమోగ్రాఫిక్‌ ఫ్యూచర్‌ సర్వే- 2026 తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్

Updated Date - Nov 20 , 2026 | 06:32 AM