పాలమూరుకు ఉపశమనం.. నీటి విడుదలకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్..
ABN , Publish Date - Sep 23 , 2026 | 01:24 PM
తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదలకు కర్ణాటక సర్కార్ అంగీకారం తెలిపింది. అల్మట్టి నుంచి మూడు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదలకు కర్ణాటక సర్కార్ అంగీకారం తెలిపింది. అల్మట్టి నుంచి మూడు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు. అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ బృందం.. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు జి. మధుసూదన్ రెడ్డి, మేఘరెడ్డి ఉన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆల్మట్టి నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని ఇప్పటికే మంత్రులు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీటి ఎద్దడి, పంటల ప్రస్తుత పరిస్థితులు వంటి అంశాలను డీకే శివకుమార్‌కు మంత్రులు వివరించారు. మానవతా దృక్పథంతో పాలమూరు ప్రజలకు సాగు, తాగునీటిని విడుదల చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరారు. మంత్రుల విజ్ఞప్తికి కర్ణాటక సీఎం అంగీకరించారు. నీటి విడుదలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటి విడుదలలో ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
కాగా, సీఎం రేవంత్‌రెడ్డి నిన్న తనకు ఫోన్ చేశారని తెలంగాణ ప్రజాప్రతినిధులకు డీకే శివకుమార్ వెల్లడించారు. తాను అసెంబ్లీలో ఉండటంతో రేవంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడలేకపోయానని డీకే వివరించారు. తిరిగి కాల్ చేసి చాలాసేపు మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తే రైతుల అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా తెలంగాణకు నీటిని విడుదల చేస్తామని కర్ణాటక ఇరిగేషన్ అధికారులు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను శరవేగంగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం
విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News