లాఠీలు కాంగ్రెస్‌కు కొత్త కాదు.. దేశాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం: సీఎం రేవంత్
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:44 PM
అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ, పోలీసుల పాశవిక దాడికి ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
వికారాబాద్, జులై 22: అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ, పోలీసుల పాశవిక దాడికి ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(బుధవారం) కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలను ఆ పార్టీ నాయకులు అమ్ముకుని.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను అరెస్టు చేసి, పేపర్ లీక్ చేసిన వాళ్లను జైల్లో పెట్టాల్సింది పోయి.. విద్యార్థులపై పాశవిక దాడి జరిపారని ఫైర్ అయ్యారు.
ఆడపిల్లలపై దాడి చేశారని.. విద్యార్థుల తలలు పగలగొట్టారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో విద్యార్థులు కనిపించడంలేదని, వారిని ఎక్కడికైనా తీసుకెళ్లారా? లేక కిడ్నాప్ చేశారో తెలియదన్నారు. విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ప్రధాని ఇంటి ముందు నిరసన చేపట్టారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కు అని చెప్పుకొచ్చారు. పేపర్ లీక్‌పై పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకున్నారని.. రాహుల్ గాంధీపై పాశవిక దాడితో ఆయన రక్తం నేలకు చిందిందన్నారు. దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నా సోనియా గాంధీ ప్రధాని పదవి తీసుకోలేదని.. మంత్రి పదవి కూడా చేపట్టలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గేను నియమించారు తప్ప పదవులు తీసుకోలేదని చెప్పుకొచ్చారు.
2019 ఇంటర్ ఫలితాల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా అవకతవకలకు పాల్పడి విద్యార్థుల ప్రాణాలు బలిగొందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పప్పులు ఉడకవని పేరు మార్చుకుని గ్లోబరీనా సంస్థ కేంద్రం వద్దకు వెళ్లిందని.. అప్పుడే ఆ సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదన్నారు. నీట్ పరీక్ష నిర్వహించడంతో దొంగతనం చేయొచ్చన్న ధైర్యం వాళ్లకు వచ్చిందని విమర్శించారు. CBSEలో జరిగిన అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్‌పై విద్యార్థులు నిరసన తెలిపారన్నారు. లాఠీలు కాంగ్రెస్‌కు కొత్త కాదని.. ఆంగ్లేయులతో పోరాడి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. దేశాన్ని దోచుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. యువత పక్షాన నిలిచి మోదీపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అందరం కలిసి పోరాటం చేసి మోదీని గద్దె దించి.. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండ: కవిత
అదుపుతప్పి మూడు వాహనాలను ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. ఒకరి మృతి
Read Latest Telangana News And Telugu News