Share News

‘పిల్లలను చదివించే ప్రతి తల్లికీ నా వందనం’: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Jul 22 , 2026 | 10:08 AM

ఏ ఒక్క చిన్నారీ విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం నిధుల విడుదల సందర్భంగా ఎక్స్‌ వేదికగా మంత్రి స్పందించారు.

‘పిల్లలను చదివించే ప్రతి తల్లికీ నా వందనం’: మంత్రి లోకేశ్
Minister Nara Lokesh

అమరావతి, జులై 22: రాష్ట్రవ్యాప్తంగా ‘తల్లికి వందనం’ నిధులను కూటమి ప్రభుత్వం ఈరోజు(బుధవారం) విడుదల చేయనుంది. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనుంది. తల్లికి వందనం నిధుల విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఏ ఒక్క చిన్నారీ విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. ‘పిల్లలే మన సంపద. వారి చదువులే మనకు తరగని ఆస్తి. విద్యే మన రాష్ట్రానికి వెలకట్టలేని పెట్టుబడి’ అని చెప్పుకొచ్చారు.


ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇచ్చేలా తల్లికి వందనం పథకాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. వరుసగా రెండో ఏడాది తల్లికి వందనం నిధులను విద్యా సంవత్సరం ఆరంభంలోనే విడుదల చేశామన్నారు. తల్లికి వందనం ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. 42.70 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేస్తున్నామన్నారు. నేటి నుంచి ఈనెల 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ‘పిల్లలను చదివించే ప్రతి తల్లికీ నా వందనం’ అని ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వరుసగా 11వ రోజూ ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్..

ఆ మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు: మంత్రి టీజీ భరత్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 10:51 AM