ఆగిన మగ్గం చప్పుడు
ABN , Publish Date - Aug 07 , 2026 | 01:34 PM
చేనేత హస్త కళలకు జీవం పోస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు.
తెగిన దారాలు.. చేనేతల జీవితాలు
ప్రోత్సాహం లేక కార్మికుల వలసబాట
మూతబడిన చేనేత సంఘాలు
నేడు జాతీయ చేనేత దినోత్సవం
తాండూరు(వికారాబాద్): చేనేత హస్త కళలకు జీవం పోస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. గతంలో ఒక్కోపోగు జత చేసి, వివిధ ఆకృతులతో ఆకట్టుకునే వస్ర్తాలను చేనేతలు అందించారు. అలాంటి వృత్తిదారులకు ప్రభుత్వ ప్రోత్సహం కరువైంది. జీవనాధారం లేక అనేక మంది వలసలు వెళ్లిన పరిస్థితి. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఒకప్పుడు చేనేత వృత్తి కళాకారుల సందడి, మగ్గాల చప్పుళ్లతో కళకళలాడిన ప్రాంతాలు నేడు వెలవెలబోతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఖ్యాతిగాంచిన ప్రాంతంలో ప్రస్తుతం మగ్గాలు మూలనపడ్డాయి. పవర్‌లూమ్స్, కంప్యూటర్ డిజైన్ల రాకతో చేనేత వృత్తికి గుర్తింపు లేకుండా పోయింది. తరాలుగా ఈ వృత్తితో జీవనం సాగిస్తున్న చేనేత కార్మికులు జీవనోపాధి కోసం వేరేదారి వెతుక్కుంటున్నారు. తాండూరు నియోజకవర్గ పరిధి యాలాల, గోవిందరావుపేట్, ముద్దాయిపేట్, మైల్వారంలో 200వరకు చేనేత మగ్గాలుండేవి.
ప్రస్తుతం ఈ ఇక్కడి చేనేత పరిశ్రమ మూతబడింది. ఒకప్పుడు నారాయణపేట, కోస్గి నుంచి నూలు తీసుకొచ్చి వస్ర్తాలను నేసేవారు. రెండు దశాబ్దాల క్రితం చేనేత పరిశ్రమ ఈ ప్రాంతాల్లో కళకళలాడింది. నూలు రేటు పెరగడం, సహకారం లేక, ఆధునిక యంత్రాల రాకతో నేత కార్మికులు జీవనోపాధికి ఇబ్బందులు వచ్చాయి. దీంతో వృత్తిని వదులుకొని బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. కాగా, నేటికీ యాలాల చేనేత సహకార సంఘం కొనసాగుతోంది. అలాగే దశాబ్దాల చరిత్ర కలిగిన ఆమనగల్లు సొసైటీ మూతపడింది. ఈ సొసైటీ కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసపోవడంతో సొసైటీ ఎన్నికలు కూడా నిర్వహించలేని పరిస్థితి.
ప్రభుత్వం ప్రోత్సహం అందించాలి
25ఏళ్లుగా చేనేత కార్మికులకు ఎలాంటి సహకారం అందడం లేదు. ప్రత్యేక నిధులు, మార్కెటింగ్ వ్యవస్థ కల్పించాలి. పాత పనిముట్ల ఈ కాలానికి పనికిరావడం లేదు. కొత్త మగ్గాలను కొనే శక్తి కార్మికులకు లేదు. చేనేత కార్మికులకు సహకార సంఘం ద్వారా ప్రభుత్వం పనిముట్ల అందించాలి. ప్రభుత్వం చేనేత రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.
రవీందర్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు, యాలాల
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర మందులేవీ..?
హైదరాబాద్‌లో తప్పని నీళ్ల సర్దుబాటు
Read Latest AP News And Telangana News And International News And Telugu News