ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర మందులేవీ..?
ABN , Publish Date - Aug 07 , 2026 | 10:41 AM
ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర ఔషధాల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మందులతో పాటు సిరంజీలు, ఇంజక్షన్‌లు సైతం దొరకని పరిస్థితి నెలకొంది.
దొరకని అల్యూమినియం హైడ్రాక్సైడ్, పాంటోప్రోజోల్ మందులు
కొన్ని చోట్ల దగ్గుమందు అంబ్రాక్సిల్ నిల్వలు అంతంతే
ఇన్సులిన్ ఇంజక్షన్లు, బుపి వాకైన్ ఇంజక్షన్‌ల కొరతతో ఇబ్బందులు
2సీసీ, 5సీసీ సిరంజీలు కూడా దొరకని పరిస్థితి
మందుల కొరతతో ప్రిస్ర్కిప్షన్లన్నీ బయటకే పంపిస్తున్న వైనం
నిలుస్తున్న శస్త్ర చికిత్సలు.. ఇబ్బంది పడుతున్న బాధితులు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)
ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర ఔషధాల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మందులతో పాటు సిరంజీలు, ఇంజక్షన్‌లు సైతం దొరకని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా అల్యూమినియం హైడ్రాక్సైడ్, పాంటోప్రాజోల్, అంబ్రాక్సిల్ వంటి సాధారణంగా వినియోగించే మందులతో పాటు షుగర్ పెషేంట్లకు అ త్యవసరమైన ఇన్సులిన్ ఇంజెక్షన్‌లు, బుపివా కైన్ ఇంజెక్షన్‌ల సరఫరా నిలిచిపోయింది. వీటితో పాటు సీసీ-2, సీసీ-5 సిరంజీలు కూడా అనేక ఆస్పత్రుల్లో అందుబాటులో లేకపోవటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యులు రాసే ప్రిస్ర్కిప్షన్లలోని మందు లను బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి పరిస్థితి ఏర్పడగా, కొన్ని చోట్ల శస్త్ర చికిత్సలు కూడా వాయిదా పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోగుల అవస్థలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందుల కొరత నెలకొంది. సీజనల్ మందులతో పాటు రోగులకు అత్యవసరంగా అందించే ఔషధాల ఇండెంట్ ఖాళీగా ఉండటంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎంజీఎం, జీజీ హెచ్‌లతో పాటు చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ మందుల కొరత ఉండటంతో ప్రి స్ర్కిప్షన్లతో రోగులు బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా వరంగల్ ఎంజీఎం లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏటూరునాగారం, ములుగు, మహబూబాబాద్, నర్సం పేట, పరకాల, జనగామలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి ఎంజీఎంకు వస్తున్న రోగులకు మందులు, సిరంజీలు, ఇంజక్షన్‌ల కొరత తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది.
అలాగే మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి, నర్సంపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, 50 పడకల ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో కూడా మందుల కొరత ఉంది. ప్రధానంగా కడుపులో మంట, ఎసీడీటీ, గ్యాస్, అజీర్ణం తగ్గించడానికి వాడే అల్యూమినియం హైడ్రాక్సైడ్ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో తీవ్రంగా కొరత ఉంది. వీటితో పాటు పాంటాప్రాజోల్, యాంటాసిడ్స్ మందులు సైతం కొరత ఉంది. ఇవీ గ్యాస్, కడుపు నొప్పితో పాటు అల్సర్ల కోసం ప్రతి రోజు వేలాది మంది అవసరమయ్యే ప్రాథమిక మందు. వీటి కొరత వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ఓపీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.
వీటితో పాటు అంబ్రాక్సిల్ అనే దగ్గు మందు కూడా చాలా ఆస్పత్రుల్లో కొరత ఉందనే టాక్ వినబడుతోంది. ప్రధానంగా దగ్గు వచ్చినప్పుడు కఫం (శ్లేష్మం)ను పలుచగా చేసి బయటకు రావడానికి, బ్రాంకైటిస్, సీవోపీడీ వంటి శ్వాసకోశ వ్యాధుల్లో ఉపయోగిస్తారు. జలుబు వల్ల కఫంతో కూడిన దగ్గు ఉన్నప్పుడు వైద్యులు తరచుగా ఈ మందును సూచిస్తారు. ప్రస్తుతం వర్షాకాలం కావటంతో ఎక్కువగా జలుబు, దగ్గుతో ఆస్పత్రులకు వెళుతున్న రోగులకు ఈ అంబ్రాక్సిల్ చాలా అస్పత్రుల్లో కొరత ఉండటంతో రోగు లు ఇబ్బందులు పడుతున్నారు.
శస్త్ర చికిత్సలకు ఇబ్బందులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంజెక్షన్‌లు, సిరంజీలు, ఇన్సు లిన్‌లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంజీఎంతో పాటు జీజీహెచ్, పలు పీహెచ్‌సీలు, వైద్యవిధాన పరిషత్ తదితర ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి అందుబాటులో ఉండటం లేదు. మధుమేహం (షుగర్) వ్యాధి ఉన్న పేద రోగులకు ఇన్సులిన్ ప్రాణాధారం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్సులిన్ కొరతతో షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో భారీగా ధరలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆర్థికంగా లేని పేదలు ప్రైవేటుగా షుగర్ ఇన్సులిన్‌లు కొనుగోలు చేయలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇన్సులిన్‌లు అందుబాటులో లేకపోవటం మధుమేహగ్రస్తులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే మరో అత్యవసరమైన బుపివాకైన్ ఇంజెక్షన్‌లు కూడా ఉమ్మడివరంగల్ జిల్లాలోని చాలా ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. ఆపరేషన్‌ల సమయంలో వాడే ఆనస్థీషియా మందు ఇది. వీటి కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవాలు తాత్కాలికంగా నిలిచిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎంజీఎంతో పాటు మరికొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవి అందుబాటులో లేకపోవటంతో బయట నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఇక చివరికి సిరంజీల కొరత కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేధిస్తున్నాయి. 2సీసీ, 5సీసీ సిరంజీలు ప్రతీ చిన్న ఇంజెక్షన్‌లకు, రక్త పరీక్షలకు తప్పనిసరిగా వినియోగించాల్సిందే. సిరంజీల అందుబాటులో లేకపోవటంతో వైద్యులు బయట ప్రైవేటుమెడికల్ షాపుల్లో కొనుక్కురమ్మని రాసిస్తున్నారు. ప్రభుత్వ ఫార్మసీల్లో సగం మందులే ఇచ్చి.. మిగతావి బయట కొనుక్కొమ్మని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.
సమన్వయ లోపమా..? అధికారుల నిర్లక్ష్యమా..?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి ఉమ్మడి జిల్లా వైద్యరంగంపై సమీక్ష నిర్వహించి, అత్యాధునిక సేవలు అందిస్తామని ప్రకటించినప్పటికి, క్షేత్రస్థాయిలో మాత్రం పేద రోగులకు కనీసం సిరంజీలు, గ్యాస్ మాత్రలు, ఇన్సులిన్‌లు సకాలంలో అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 80 శాతం మందులు టీజీఎంఐడీసీ ద్వారా సరఫరా జరుగుతోంది. మిగతా 20 శాతం మందులు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి అభివృద్ధి నిధుల (హెడీఎఫ్) ద్వారా స్థానికంగా కొనుగోలు చేయవచ్చు.
అయితే ఆయా ఆస్పత్రుల్లో మందుల కొరతకు ఫార్మసిస్టులు, సూపరింటెండెంట్‌లు, వైద్యాధికారుల మధ్య సమన్వయం లేకపోవటం మందుల కొరతకు కారణంగా చెబుతున్నారు. ప్రతీ ప్రభుత్వానికి ఎన్ని మందులు.. ఏమేమీ కావాలో ఇండెంట్‌ను సదరు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. అయితే ముందు ఫార్మసిస్టు, ఆస్పత్రి వైద్యాధికారితో పాటు వివిధ విభాగాల వైద్యులతో చర్చించి ప్రభుత్వానికి ఇండెంట్ సమర్పిస్తే మందుల కొరత అనేది రాదనే టాక్ వినబడుతోంది. అయితేకొందరు సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులు పాత ఇండెంట్‌ను 10 శాతం అటు ఇటుగా పెంచి ప్రభుత్వానికి పంపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో రోగుల సంఖ్య పెరిగినప్పుడు ఆస్పత్రిలో సరిపడా ఔషధాలు లేక వైద్యం అందటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని సర్కారు దవాఖానల్లో కొరతగా ఉన్న మందులను గుర్తించి వెంటనే సరఫరా చేయాలని బాధితులు విజ్ఞప్తిచేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
హైదరాబాద్‌లో తప్పని నీళ్ల సర్దుబాటు
Read Latest AP News And Telangana News And International News And Telugu News