Share News

భూ భారతి ఆపరేటర్లు ఔట్‌

ABN , Publish Date - Aug 07 , 2026 | 10:01 AM

రెవెన్యూ శాఖలో అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పారదర్శక సేవలతో పాటు బాధ్యతాయుతంగా ఉండేలా చర్యలకు శ్రీకారం చుట్టింది.

భూ భారతి ఆపరేటర్లు ఔట్‌
Bhu Bharati operators

  • తొలగింపునకు ప్రభుత్వం చర్యలు

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 95 మందిపై వేటు?

  • వారి స్థానంలో జూనియర్‌ అసిస్టెంట్లకు బాధ్యతలు

  • భూ అక్రమాల్లో ఆపరేటర్లపై వెల్లువెత్తిన ఆరోపణలు

  • నోట్లకు పడగలెత్తిన కొందరు ఆపరేటర్లు

హనుమకొండ: రెవెన్యూ శాఖలో అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పారదర్శక సేవలతో పాటు బాధ్యతాయుతంగా ఉండేలా చర్యలకు శ్రీకారం చుట్టింది. కీలకమైన రెవెన్యూ శాఖలో ప్రైవేట్‌ వ్యక్తుల జోక్యాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఇందులో భాగంగానే ఔట్‌సోర్సింగ్‌ విధానంలో విధులు నిర్వ హిస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లను పూర్తిగా తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.


థర్డ్‌ పార్టీ పద్ధతికి స్వస్తి..

ఇప్పటివరకు థర్డ్‌ పార్టీ ఏజెన్సీల ద్వారా నియమితులైన కంప్యూటర్‌ ఆపరేటర్లే భూ భారతి పోర్టల్‌ లాగిన్లు, స్లాట్‌ బుకింగ్‌లు, రిజిస్ట్రేషన్ ల క్రియలను నిర్వహించేవారు. పర్యవేక్షణ కొరవడటంతో వీరే సర్వాధికారు లుగా కొంతమంది మారి అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ వ్యక్తులను పూర్తిగా పక్క నబెట్టి, వారి స్థానంలో పక్కా ప్రభుత్వ ఉద్యో గులైన జూనియర్‌ అసిస్టెంట్లకు భూభారతి పోర్టల్‌ లాగిన్‌ ఐడీలు, రిజిస్ట్రేషన్ బాధ్యతల ను అప్పంగించేందుకు రెవెవన్యూ శాఖ కసరత్తు పూర్తి చేసింది.


95 మందిపై వేటు

తహసీల్దార్‌ కార్యాలయాలను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాలో 95 మందికి పైగా ఆపరేటర్లు తాత్కాలిక ఉద్యోగులు కావడంతో, రెవెన్యూ లావాదేవీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. భూ భారతి పోర్టల్‌ ఆపరేటర్లను పూర్తిస్థాయిలో తొలగించి వారి స్థానంలో రెవెన్యూ శాఖలోనే పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూభారతి రిజిస్ట్రేషన్ బాధ్యతలను వీరికి అప్పగించే దిశగా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం.


hnk1.jpgఇంటెన్సివ్‌ ట్రైనింగ్‌

అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించిన తర్వాత సేవల కు విఘాతం కలగకుండా జూనియర్‌ అసిస్టెంట్లకు వారం రోజుల పాటు సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నారు. స్లాట్‌ బుకిం గ్‌, భూముల వివరాల నమోదు, హక్కుల మార్పిడి, ఇతర రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలపై వీరికి సమగ్ర అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులే నేరుగా ఆపరేటర్లుగా వ్యవహరించ డంతో ఏదైనా అక్రమం లేదా పొరపాటు జరిగితే నేరుగా వారిపైనే క్రమశిక్షణ చర్యలు, సస్పెన్షన్‌ చేసే వెసులుబాటు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


వెల్లువెత్తిన ఆరోపణలు

ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లాల్లో ని పలు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఆపరేట ర్ల తీరుపై తీవ్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువె త్తాయి. పట్టాదారు అనుమతి లేకుండానే ఇత రుల పేరిట భూములు మార్చడం, ప్రభుత్వ సర్వే నెంబర్ల పరిధిలోని అసైన్డ్‌ భూములకు బినామీ పేర్లతో పట్టాలు సృష్టించడం వంటి అక్రమాలకు కొందరు ఆపరేటర్లు సహకరించి నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ని కీలక మండలాల్లో ప్రతి రిజిస్ట్రేషన్‌కు వేల రూపాయలు డిమాండ్‌ చేసిన ఘటనలున్నాయి. కొద్దిపాటి వేతనానికి పనిచేసే ఆపరేటర్లు స్వల్ప కాలంలోనే లక్షలు గడించి లగ్జరీ కార్ల లో తిరిగే స్థాయికి చేరడం పరిస్థితికి అద్దం పడుతోంది.


పది రోజుల్లో కొత్త విధానం

ప్రభుత్వ ఆదేవాల మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రక్షాళన చర్యలను వేగవంతం చేశారు. రాబోయే 10 రోజుల్లో జూనియర్‌ అసిస్టెంట్లు భూభారతి బాధ్యతలు స్వీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నిర్ణయంతో ప్రైవేట్‌ వ్యక్తుల హ వాకు, దళారుల దందాకు పూర్తిగా తెరపడ నుండటంతో రైతులు, భూ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

హైదరాబాద్‌లో తప్పని నీళ్ల సర్దుబాటు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 07 , 2026 | 10:06 AM