Share News

ట్రంప్ కొత్త ఆదేశాలు.. జన్మతః పౌరసత్వ నిబంధనలు మరింత కఠినతరం

ABN , Publish Date - Aug 07 , 2026 | 08:26 AM

యూఎస్‌లోకి వలసలను అరికట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌కు (పుట్టుకతో పౌరసత్వం) సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశారు.

ట్రంప్ కొత్త ఆదేశాలు.. జన్మతః పౌరసత్వ నిబంధనలు మరింత కఠినతరం
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్‌లోకి వలసలను అరికట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌కు (పుట్టుకతో పౌరసత్వం) సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈ తరహా పౌరసత్వానికి అర్హులు కాని వారి జాబితాలో కొత్త వర్గాలను చేరుస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, బర్త్‌టూరిజాన్ని నిషేధించారు. తమ బిడ్డలకు అమెరికా పౌరసత్వం కోసం విదేశీయులు అక్కడికెళ్లి పిల్లల్ని కనడాన్ని బర్త్ టూరిజం అంటారన్న విషయం తెలిసిందే.


అమెరికా చట్టాల ప్రకారం, అక్కడ జన్మించిన వారికి యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబంధను చైనా, రష్యాలు దుర్వినియోగం చేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. బర్త్‌రైట్ పౌరసత్వం కట్టడికి ట్రంప్ ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నాలను అక్కడి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయినా వెనక్కు తగ్గని ట్రంప్ మరో మార్గంలో ఆంక్షలను కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ‘ఇది ఎప్పుడో చేసుండాల్సింది. ఏదేమైనా ప్రస్తుతం మేము పరిస్థితిని చక్కదిద్దుతున్నాము. విదేశీ శక్తులు అమెరికా పౌరసత్వాన్ని దుర్వినియోగం చేయకుండా మేము రక్షణగా నిలుస్తున్నాము’ అని ట్రంప్ చెప్పారు.

ట్రంప్ తాజా ఆదేశాల ప్రకారం, తల్లిదండ్రుల్లో ఎవరైనా విదేశీ టెర్రరిస్టు గ్రూప్‌కు చెందిన వారైతే అమెరికాలో వారికి పుట్టే బిడ్డకు ఆటోమేటిక్‌గా యూఎస్ పౌరసత్వం దక్కదు. విదేశీ ప్రభుత్వ ఉద్యోగులు, అక్రమమార్గంలో పౌరసత్వం పొందిన వారి పిల్లలు అమెరికాలో పుట్టినా జన్మతః పౌరసత్వం దక్కదు. కేవలం పౌరసత్వం కోసం అమెరికాకు వెళ్లి పిల్లల్ని కన్న వారినీ జన్మతః పౌరసత్వానికి అనర్హులుగా ట్రంప్ ప్రకటించారు.


ట్రంప్‌కు ఆ అధికారం ఉంది..

ఈ ఆదేశాలపై స్థానిక నిపుణులు స్పందిస్తూ పౌరసత్వానికి సంబంధించి కొన్ని నిబంధనల్లో మార్పులు చేసే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉందని అన్నారు. కొన్ని వర్గాలను జన్మతః పౌరసత్వానికి అనర్హులుగా ప్రకటించవచ్చని చెప్పారు. అయితే, ఒకసారి అమెరికాలో బిడ్డ పుట్టాక శిశువు పౌరసత్వం విషయంలో ట్రంప్‌కు ఎలాంటి అధికారాలు ఉండవని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

‘ఎంఆర్‌ఎన్‌ఏ ఫ్లూ వ్యాక్సిన్‌’కు ఎఫ్‌డీఏ అనుమతి

అమెరికా క్షిపణి నిల్వలు.. ట్రంప్,హెగ్సెత్ మధ్య విభేదాలు..

Updated Date - Aug 07 , 2026 | 09:23 AM