Share News

శ్రీలంక సిరీస్‌లో భారత్‌కు ‘డూ ఆర్ డై’.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే?

ABN , Publish Date - Aug 07 , 2026 | 09:42 AM

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ అత్యంత కీలకం కానుంది. మరి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే సమీకరణాలు ఇలా..

శ్రీలంక సిరీస్‌లో భారత్‌కు ‘డూ ఆర్ డై’.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే?
India Vs Sri Lanka

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు తప్పక మెరుగైన ఫలితం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత్ 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 4 ఓటములతో 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక 41.67 పీసీటీతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే..?


భారత్ 2-0తో సిరీస్ గెలిస్తే..

భారత్ పీసీటీ 57.58కు పెరుగుతుంది. అయినప్పటికీ నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ (58.33)ను దాటలేదు. దీంతో టీమిండియా పట్టికలో ఐదో స్థానంలోనే కొనసాగుతుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో బలంగా నిలిచే అవకాశం ఉంటుంది.

సిరీస్ 1-1తో సమమైతే..

భారత్ పీసీటీ 48.48కు చేరుతుంది. శ్రీలంక పీసీటీ 44.44 మాత్రమే కావడంతో భారత్ ఐదో స్థానాన్ని కోల్పోదు.

భారత్ 1-0తో సిరీస్ గెలిస్తే..

భారత్ పీసీటీ 51.52కు మెరుగవుతుంది. అయినా ఐదో స్థానంలోనే కొనసాగుతుంది.

భారత్ 1-0తో సిరీస్ ఓడితే..

శ్రీలంక పీసీటీ 50.00కు చేరి భారత్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానాన్ని దక్కించుకుంటుంది.

భారత్ 0-2తో సిరీస్ కోల్పోతే..

ఇది టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ అవుతుంది. భారత్ పీసీటీ 39.39కు పడిపోగా, శ్రీలంక 61.11 పీసీటీతో ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. దీంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారతాయి. ముఖ్యంగా తర్వాతి సిరీస్‌లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఉండటంతో గిల్ సేనపై ఒత్తిడి మరింత పెరగనుంది.

WTC.jpg


గంభీర్‌పై ఒత్తిడి?

ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవడానికి శ్రమిస్తోన్న టీమిండియా.. శ్రీలంకతో సిరీస్ ఓడితే పరిస్థితులు సంక్లిష్టంగా మారుతాయి. దీంతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతాయి. ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌పై కూడా బీసీసీఐ వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిల్‌తో పాటు గంభీర్, అగార్కర్‌లకు కూడా శ్రీలంక పర్యటన అత్యంత కీలకం కానుంది. కాగా నేటి నుంచి లంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

వైభవ్ విజయాల్లో కుటుంబ సభ్యులదే అత్యంత కీలక పాత్ర: రహానె

నబిని నేరుగా జట్టులోకి తీసుకోవాల్సింది.. అగార్కర్, గంభీర్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

Updated Date - Aug 07 , 2026 | 09:44 AM