Share News

హైదరాబాద్‌లో తప్పని నీళ్ల సర్దుబాటు

ABN , Publish Date - Aug 07 , 2026 | 08:55 AM

హైదరాబాద్‌ మహా నగరంలో నీళ్ల సర్దుబాటు అత్యంత కీలకంగా మారింది. ఎల్‌నినో ప్రభావంతో సమృద్ధిగా వర్షాలు కురవడం లేదు.

హైదరాబాద్‌లో తప్పని నీళ్ల సర్దుబాటు
Hyderabad water supply

  • కృష్ణా జలాలు గోదావరి ఏరియాకు..

  • గోదావరి జలాలు సింగూరు ప్రాంతాలకు..

  • ఎల్‌నినో ప్రభావం లేకుండా వాటర్‌బోర్డు చర్యలు

  • త్వరలోనే మిషన్‌ భగీరథ నుంచి 20ఎంజీడీల రాక

  • ఘన్‌పూర్‌ వద్ద 120మీటర్లతో వెయ్యి మి.మీ డయా పైపులైన్‌

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగరంలో నీళ్ల సర్దుబాటు అత్యంత కీలకంగా మారింది. ఎల్‌నినో ప్రభావంతో సమృద్ధిగా వర్షాలు కురవడం లేదు. జలాశయాల్లో కూడా ఆశించిన మేరకు నీళ్లు లేవు. ఇటీవల కురిసిన వర్షాలతో సింగూరు జలాశయంలో మరో 80 రోజులకు సరిపడా ఉన్నాయి. మున్ముందు వర్షాలు లేకుంటే 80రోజుల తర్వాత నగరానికి సింగూరు జలాలు నిలిచిపోయే పరిస్థితి ఉండడంతో ప్రత్యామ్నాయ చర్యలకు వాటర్‌బోర్డు దిగింది. కృష్ణా, గోదావరి జలాలను మరిన్ని ప్రాంతాలకు రివర్స్‌ పంపింగ్‌లో తరలించడానికి ప్రణాళికలు రూపొందించింది.


576.55 మిలియన్‌ గ్యాలన్ల నీళ్లు

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో వాటర్‌బోర్డు తాగునీటి సరఫరా చేస్తోంది. పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజు విడిచి రోజు, పాత జీహెచ్‌ఎంసీ అవతలి ప్రాంతాలకు రెండు, మూడు రోజులకోసారి నీళ్లు అందిస్తోంది. నగరంలో నీటి సరఫరా కోసం సుదూర ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా నదులతో పాటు జంట జలాశయాల నుంచి మొత్తంగా 576.55 మిలియన్‌ గ్యాలన్ల నీటిని రోజూ నగరానికి తీసుకొస్తున్నారు. ఇందులో అత్యధికంగా 270 మిలియన్‌ గ్యాలన్లు నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా జలాలను మూడు ఫేజ్‌లో తీసుకుంటూ నగరంలోని అత్యధిక ప్రాంతాలకు అందిస్తున్నారు. కృష్ణా జలాలు నగరానికి రాక ముందు మంజీరా జలాలు నగరంలోని అత్యధిక ప్రాంతాలకు సరఫరా అయ్యేవి. కృష్ణా జలాలు అధికంగా వచ్చిన తర్వాత వాటిని సింగూరు, మంజీరా పైపులైన్లలో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా అందిస్తున్నారు. సింగూరు, మంజీరా జలాలు కొన్ని ప్రాంతాలకే సరఫరా అవుతున్నాయి.


80 రోజులకు సరిపడా నీళ్లు

నేషనల్‌ డ్యామ్‌ సెక్యూరిటీ సూచనల మేరకు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయంతో సింగూరు జలాశయంలో నీటి మట్టాలను తగ్గించారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 523 అడుగులు కాగా, ప్రస్తుతం 519 అడుగుల్లో నీళ్లు ఉన్నాయి. సింగూరు జలాశయంలో నీటి మట్టాలు 516 అడుగులకు చేరగానే గ్రావిటీ ద్వారా వచ్చే జలాలు పంపుహౌజ్‌కు నిలిచిపోతాయి. నెల రోజుల క్రితం అత్యవసర పంపింగ్‌కు ఏర్పాట్లు చేయగా ఇటీవల కురిసిన వర్షాలతో సింగూరు జలాశయంలోకి నీళ్లు చేరడంతో రెండు అడుగులు పెరిగాయి. దాంతో మరో 80రోజుల వరకు నీళ్లు ఇబ్బందులుండవు.


ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు కురవకపోతే సింగూరు జలాలు నగరానికి తరలించడానికి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇప్పటికే సింగూరు పైపులైన్‌ ఎన్నో ఏళ్ల నాటిది కావడంతో తరచూ లీకేజీలు, పగుళ్లు ఏర్పడుతున్నాయి. సింగూరు జలాలు సరఫరా జరిగే ప్రాంతాలైన షేక్‌పేట్‌, బోరబండా రిజర్వాయర్‌, లింగంపల్లి రిజర్వాయర్‌ ప్రాంతాలకు, ఖానాపూర్‌ గ్రావిటీ 1200 ఎంఎం మెయిన్‌ ఆన్‌లైన్‌ సప్లయ్‌ ప్రాంతాలకు, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌ రిజర్వాయర్ల ప్రాంతాలకు సక్రమంగా అందడం లేదు.


city3.2.jpgత్వరలోనే 20ఎంజీడీలు రాక

నగరానికి రావాల్సిన గోదావరి జలాల్లో 20 మిలియన్‌ గ్యాలన్లను మిషన్‌ భగీరథకు వినియోగిస్తున్నారు. మిషన్‌ భగీరథకు నీటి వనరులను సమకూర్చుకోవడంతో 20 మిలియన్‌ గ్యాలన్ల నీటిని నగరానికి వినియోగించనున్నారు. ఇప్పటికే మిషన్‌ భగీరథ అధికారులు అంగీకరించారు. త్వరలోనే గోదావరి జలాలు అదనంగా 20మిలియన్‌ గ్యాలన్లు ప్రతీరోజు (ఎంజీడీ) రానున్నాయి. గోదావరి జలాలను తీసుకునే ఘన్‌పూర్‌ వద్ద 120 మీటర్ల మేర వెయ్యి మి.మీ డయా పైపులైన్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియను చేపట్టారు. సింగూరు నుంచి నీటి సరఫరా నిలిచిపోయిన కానీ నగరంలో వివిధ ప్రాంతాలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అయితే గోదావరి ఫేజ్‌-2, ఫేజ్‌-3 ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో ఏడాదిన్నర పాటు సమయం పడుతుందని, అప్పటి వరకు హైదరాబాద్‌ మహా నగరంలో నీటి సర్దుబాటు చేయక తప్పదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.


రివర్స్‌ పంపింగ్‌లో..

కృష్ణా, గోదావరి జలాలు సరఫరా జరిగే ప్రాంతాలకు రోజు విడిచి రోజు సమృద్ధిగా నీళ్లు అందుతుండగా, సింగూరు, మంజీరా జలాలు సరఫరా జరిగే ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయాలుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కృష్ణా, గోదావరి జలాలను సింగూరు, మంజీరా జలాలు సరఫరా జరిగే ప్రాంతాలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 07 , 2026 | 08:55 AM