Share News

ఏపీ హస్తకళలపై క్యూఆర్‌ కోడ్‌

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:44 AM

ఆంధ్రప్రదేశ్‌ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలకు అనుగుణంగా లేపాక్షి ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది.

ఏపీ హస్తకళలపై క్యూఆర్‌ కోడ్‌

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచనతో లేపాక్షి నిర్ణయం

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలకు అనుగుణంగా లేపాక్షి ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ప్రతి కళాఖండం, కళారూపం పూర్తి వివరాలు తెలిసేలా, దాన్ని రూపొందించిన కళాకారుడికి తగిన గుర్తింపు లభించేలా ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ వ్యవస్థను తీసుకురావాలని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవం సందర్భంగా సూచించారు. దీంతో ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ కేవలం నెల రోజుల వ్యవధిలో దేశంలో తొలిసారిగా హస్తకళలకు క్యూఆర్‌ కోడ్‌ వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కళ-ఉత్పత్తి-వివరాలు తెలిపేలా ఈ క్యూఆర్‌ కోడ్‌ను తీసుకొచ్చారు. వస్తువుపై ఉన్న కోడ్‌ను మొబైల్‌తో స్కాన్‌ చేస్తే ఆ కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలను సెకన్లలో తెలుసుకోవచ్చు. ఆ వస్తువు చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, తయారు చేసిన కళాకారుడి పేరు, వారి నైపుణ్యం, తయారు చేయడానికి వారు పడిన కష్టం, ఉపయోగించిన ముడిసరుకు, తయారీకి పట్టిన సమయం, వస్తువు కొలతలు వంటి వివరాలతోపాటు, దాని భౌగోళిక గుర్తింపు సమాచారం అందుబాటులో ఉంటుంది. మొదటి దశలో బొబ్బిలి వీణ, సంపూర్ణ రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణలీలా, మత్య్సావతారం కలంకారి పెయింటింగ్స్‌, సవర ఆదివాసి పెయింటింగ్స్‌ సహా 8 ఐకానిక్‌ హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్‌ కోడ్‌ ప్రొఫైల్స్‌ను అధికారులు కేటాయించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని హస్తకళా ఉత్పత్తులు, కళాకారుల క్లస్టర్లకు ఈ విధానాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టారు.

Updated Date - Aug 07 , 2026 | 05:45 AM