దేశంలో అత్యుత్తమ జోన్‌గా సౌత్ కోస్ట్ రైల్వే.. రూ.2,493 కోట్ల ఆదాయంతో రికార్డు
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:39 PM
వైజాగ్ రైల్వే జోన్ రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యుత్తమ జోన్‌గా సౌత్ కోస్ట్ రైల్వే నిలిచిందని పేర్కొంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 7: వైజాగ్ రైల్వే జోన్ రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యుత్తమ జోన్‌గా సౌత్ కోస్ట్ రైల్వే నిలిచిందని పేర్కొంది. అతిస్వల్ప కాలంలోనే సౌత్ కోస్ట్ రైల్వే(SCoR) జోన్ సత్తా చాటిందని తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రూ.54,000 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పైప్‌లైన్‌లో మరో రూ.71,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. విశాఖపట్నం రైల్వే యార్డ్ ఆధునికీకరణ కోసం రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపింది.
అలాగే గుంతకల్ - బళ్లారి నాలుగు లైన్ల విస్తరణకు రూ.1,205 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ పేర్కొంది. విజయవాడ డివిజన్ కేంద్రంగా రైల్వే అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని.. 5 కొత్త రైల్వే మార్గాలు, 24 మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించింది. రైళ్ల భద్రతే లక్ష్యంగా 100 ఇంజిన్లలో ‘కవచ్’ (Kavach) వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 2026 చివరి నాటికి తొలి 100 కిలోమీటర్ల పరిధిలో కవచ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు చెప్పింది. విశాఖపట్నం రైల్వే యార్డ్ పునర్నిర్మాణంలో భాగంగా 6 కొత్త ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొంది. తిరుపతి రైల్వే స్టేషన్‌లో భక్తుల రద్దీని నియంత్రించేందుకు రూ.20 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపింది.
రైల్వే ప్రమాదాల నివారణకు ఏపీ వ్యాప్తంగా 300కు పైగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ROB), రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు (RUB) నిర్మిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ పేర్కొంది. అలాగే రాబోయే గోదావరి పుష్కరాలు దృష్ట్యా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ముందస్తు సమీక్షలు పూర్తి చేసినట్లు వెల్లడించింది. రాయనపాడు, మంగళగిరి సహా 70కు పైగా రైల్వే స్టేషన్లలో ‘అమృత్ భారత్’ పథకం కింద ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రయాణికుల సౌకర్యాల కోసం విజయవాడ రైల్వే స్టేషన్‌లో ‘స్లీపింగ్ పాడ్స్’, విశాఖపట్నం స్టేషన్‌లో ‘డెక్కన్ ఛాయ్’ వంటి ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి...
జాతీయ చేనేత దినోత్సవం.. నేతన్నలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
ప్రతి భారతీయుడూ.. చేనేతకు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News