Share News

చేనేత వైభవాన్ని మళ్లీ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:52 PM

చేనేత కుటుంబాలతో కలిసి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నామని.. మొత్తం 71,636 చేనేత కుటుంబాలకు పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.

చేనేత వైభవాన్ని మళ్లీ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు
CM Chandrababu

బాపట్ల, ఆగస్టు 7: చేనేత కుటుంబాలతో కలిసి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(శుక్రవారం) వేటపాలెం మండలం కొత్తపేటలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. చీరాలకు రావడం తన అదృష్టమన్నారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నామని.. మొత్తం 71,636 చేనేత కుటుంబాలకు పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. రూ.179 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు.


చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా గుర్తింపు..

చేనేత కార్మికులంటే తనకు ప్రత్యేక అభిమానమని సీఎం అన్నారు. చేనేత కార్మికుల కష్టాలు తనకు తెలుసని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేనేత కోసం పోరాడామని గుర్తుచేశారు. చేనేత కేవలం వృత్తి కాదని.. భారతీయ సంస్కృతికి ప్రతీక అని తెలిపారు. దేశం గర్వించే కళ చేనేత అని అభివర్ణించారు. చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని.. చీరాల పట్టు, కాటన్ చీరలకు విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఒకప్పుడు చీరాల కర్చీఫ్‌లు విదేశాలకు ఎగుమతి అయ్యేవని చెప్పుకొచ్చారు. చేనేత రంగం కాలక్రమేణా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు. చేనేతను ప్రోత్సహిస్తూ జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, శ్రీకాకుళం, మంగళగిరి, పొందూరు, పెడన, నరసాపురం చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. చేనేత వైభవాన్ని మళ్లీ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం...

సుమారు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారని ముఖ్యమంత్రి వెల్లడించారు. చాలా వృత్తులను చూశానని.. చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులన్నారు. మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత అని.. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఎప్పుడూ చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటు వేశారన్నారు. ఎన్నికలకు ముందు 200 రూపాయలు హ్యాండ్లూమ్‌కి, 500 యూనిట్లు పవర్‌లూమ్‌కి సబ్సిడీ ఇస్తానని చెప్పానని.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు.


చేనేతలకు పెన్షన్ ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదే...

చేనేత కార్మికులు మగ్గం దగ్గర కూర్చొని అందులో వచ్చి కాటన్ అంతా కూడా కడుపులోకిపోయి అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చామని తెలిపారు. 50 ఏళ్లకే చేనేత కార్మికులకు పెన్షన్ ఇచ్చిన తొలి ప్రభుత్వం తమదే అని అన్నారు. 85 వేల మంది చేనేత కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నామని.. పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు పెంచామని తెలిపారు. చేనేత పెన్షన్ల కోసం ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. 109 చేనేత సహకార సంఘాలకు రూ.79 కోట్ల క్యాష్ క్రెడిట్ ఇస్తున్నామని, 10 చేనేత క్లస్టర్ల అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చేనేత మార్కెటింగ్‌కు ప్రత్యేక సహాయ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఏర్పాటు చేశామని, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.


ఎన్డీఏ విజయానికి బీసీలే కారణం..

45 ఏళ్లుగా టీడీపీకి బీసీలు వెన్నెముకగా నిలిచారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్డీఏ విజయానికి బీసీలే ప్రధాన కారణమన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని.. సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది లేని పరిపాలన అందిస్తున్నామన్నారు. నేతన్న సేవలో కింద రూ.25 వేల ఆర్థిక సాయం, తల్లికి వందనం ద్వారా ఇద్దరు పిల్లలుంటే రూ.30 వేల లబ్ధి, మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశామని అన్నారు. డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలకు తొలి సంతకంతో హామీ నెరవేర్చామని , 1.34 లక్షల మత్స్యకారులకు రూ.505 కోట్ల ఆర్థిక సాయం అందజేసినట్లు వెల్లడించారు. వడ్డర్లకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% వాటా, 3 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్‌కు రూ.98 వేల సబ్సిడీ, కేంద్రం నుంచి రూ.78 వేలు, రాష్ట్రం నుంచి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన వర్గాల రుణం తీర్చుకోవడం ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.


అభివృద్ధిపైనా శ్రద్ధ..

చేపల వేట నిషేధ సమయంలో 1.34 లక్షల మత్య్సకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున రూ.505 కోట్లు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. బీసీల కోసం రక్షణ చట్టం తీసుకువస్తున్నామని.. దీని ముసాయిదా సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో అందరికీ రూ.2.5 లక్షల చొప్పున యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకువస్తున్నామని వెల్లడించారు. అభివృద్ధితో పాటు సంక్షేమం, సుపరిపాలనను అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదలు భోజనానికి ఇబ్బందులు పడకుండా రూ.5 అన్నా క్యాంటీన్లో భోజనం అందిస్తున్నామన్నారు. కొందరు వ్యక్తులు దీనికీ అడ్డం పడి అన్నా క్యాంటీన్లను ఎత్తేశారని మండిపడ్డారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిపైనా శ్రద్ధ పెడుతున్నామన్నారు. గత పాలనలో రోడ్లన్నీ గుంతలే అని.. రాష్ట్రాన్ని చూసి ఎగతాళి చేశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రోడ్లకు మరమ్మత్తులు చేశామన్నారు. పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించామని.. రూ.12 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయని వివరించారు. యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నామని, అభివృద్ధి-ఉపాధి కల్పించేలా పారిశ్రామికాభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు కూడా రాష్ట్రంలో నిర్మించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా సూర్యలంక, బాపట్ల, చీరాల సముద్ర తీర ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ప్రతి భారతీయుడూ.. చేనేతకు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

దేశంలో అత్యుత్తమ జోన్‌గా సౌత్‌ కోస్ట్‌ రైల్వే.. రూ.2,493 కోట్ల ఆదాయంతో రికార్డు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 07 , 2026 | 01:39 PM