అక్షరంపై అలసత్వం
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:43 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరక్షరాస్యత నిర్మూలనకు అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.
మొక్కుబడిగా అక్షరాస్యత కార్యక్రమాలు
పేరు మారుతున్నా కనిపించని మార్పు
ఉల్లాస్ కార్యక్రమంపై నిర్లక్ష్యం
కలగానే సంపూర్ణ అక్షరాస్యత
అలసత్వంతో నీరుగారుతున్న లక్ష్యం
జిల్లాలో 51,36,368 జనాభా
నిరక్షరాస్యులు 39వేల మంది
నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
యాచారం(రంగారెడ్డి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరక్షరాస్యత నిర్మూలనకు అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ముఖ్యంగా నిరక్షరాసులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఉల్లాస్- నవ భారత్ సాక్షరత కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన అత్యంత కీలకమైన వయోజన విద్యా పథకం. ఈ పథకం ద్వారా 15ఏళ్లు పైబడి చదువుకోని వారిని అక్షరాస్యులుగా మార్చడం దీని ముఖ్య ఉద్దేశం.
తెలంగాణ వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరక్షరాస్యులైన పెద్దలు, మహిళలను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే విద్యార్థులు, యువతను లిటరసీ వలంటీర్లుగా చేర్చుకొని గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులకు చదువు చెప్పిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం శ్రీకారానికే పరిమితమైందని, ఆచరణకు నోచుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2011 లెక్కల ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 51,36,368 జనాభా ఉండగా, 39వేల మంది నిరక్షరాస్యులున్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
2020 నాటికే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఆనాటి ప్రభుత్వాలు లక్ష్యం పెట్టుకున్నా ఆచరణలో సాధ్యం కాలేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే 2050 నాటికి కూడా ఇది సాధ్యం కాదనిపిస్తుంది. నిరక్షరాస్యత నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యువత, విద్యార్థులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, ఉద్యోగులంతా కలిసికట్టుగా ఉద్యమిస్తేనే నిరక్షరాస్యతను నిర్మూలించడం సులువు. ఇది అక్షరసత్యమని పాలకులకు తెలిసినా అలసత్వం వహిస్తుండటంతో నేటికీ సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోయారు.
వేతనాలు ఇవ్వకపోవడంతో సాక్షరభారతి కేంద్రాల నిర్వహణ గురించి కోఆర్డినేటర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల సాక్షర భారతి వలంటీర్లకందించిన టేబుళ్లు, బోర్డులు, అల్మారాలు పంచాయతీ కార్యాలయాలకే పరిమితమైనాయి. సంబంధిత అధికారులు అంకితభావంతో పనిచేయకపోవడంతో సాక్షరభారతి కేంద్రాలు పంచాయతీ భవనాల్లో మొక్కుబడిగా సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిరక్షరాస్యత నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది ధనం ఖర్చు చేస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు.
పేరు మార్పు తప్పా..
జిల్లా అక్షరాస్యత సమితి ఆధ్వర్యంలో నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. 1984 నుంచి వివిధ రకాల పేర్లతో నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు చేపట్టినా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన దాఖలాలు లేవనేది జగమెరిగిన సత్యం. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని 1962లో రోమ్‌మహానగరంలో జరిగిన విద్యాసదస్సులో ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1988లో జాతీయ అక్షరాస్యత ఉద్యమం ప్రారంభించారు. మారుమూల గ్రామాలలో వయోజన కేంద్రాలు నడిపినా పెద్ద ప్రయోజనం చేకూరలేదు. ఆ తర్వాత సాక్షరభారతి కేంద్రాలు నడిపినా ఆశించిన మేర ఫలితాలు రాబట్టలేకపోయారు. దినపత్రికలను కూడా కేంద్రాలకు పంపించినా వయోజనుల చేత చదివించలేకపోయారు. అక్షర సంక్రాంతి, నిరంతర విద్యా కేంద్రాలు వంటివి నడిపినా ఫలితం శూన్యం. నిరక్షరాస్యత నిర్మూలనపై ఆరుడుగులు వెనక్కి మూడడుగులు ముందుకు సాగడంతో జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాదించలేకపోయారు.
ఉచిత నిర్బంధ విద్యను అమలుచేయాలి
ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరముంది. 5-14 ఏళ్ల బాలలను విధిగా బడిలో చేర్పించాల్సి ఉంది. బడీడు పిల్లలను కచ్చితంగా బడిలో చేర్పించి చదివించకపోతే శిక్షార్హులని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించి నిర్బంధ విద్యను అమలు చేయాల్సి ఉంది. బడీడు పిల్లలందరిని విదిగా బడిలో చేర్పించడం కోసమే అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల్లో నడుపుతున్నా. అవి ఆశించిన మేర పలితాలు ఇవ్వడం లేదు. ఇటుక బట్టీల వద్ద కార్మికుల పిల్లల కోసం బడులు తెరవాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. ఈ విషయమై ఎంఈవోలు తనిఖీలు చేయకపోవడంతో ఎక్కడ కూడా బడులు నడవడం లేదు.
నిరక్షరాస్యులను చదివించాలి
ఇంటర్ డిగ్రీ చదివిన యువకులు నిరక్షరాస్యులను చేరదీసి చదివించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమంతో నిరక్షరాస్యత నిర్మూలనకు చర్యలు తీసుకుంటుంది. ఉల్లాస్ కార్యక్రమం కింద ఇటీవల డ్వాక్రా పొదుపుసంఘంలో నిరక్షరాస్యులను చేరదీసి వలంటీర్లు చదివించారు. పుస్తకంలో అక్షరాలు దిద్దించాం. కనీసం వారు బస్‌బోర్డు నెంబర్, తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు చదవడం రాయడం నేర్పించాం. ఇటీవల పరీక్షలు నిర్వహించగా 3500 మంది అక్షరాస్యులుగా మారారు. ఉల్లాస్ కింద పొదుపు సంఘంలో ఉన్న మహిళలందరినీ అక్షరాస్యులుగా మార్చడం కోసం ఇందిరాక్రాంతి పథకం ఏపీఎంలకు ప్రభుత్వం బాధ్యత అప్పగించింది. ప్రతి మహిళను పదవతరగతి వరకు చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కేరళ రాష్ట్రం మాదిరిగా యువత నిరక్షరాస్యత నిర్మూలనలో భాగస్వాములు కావాలి. అలాంటప్పుడు జిల్లాలో అక్షరాస్యత సాధించడం చాలా సులువు. మండలంలోని 24 గ్రామపంచాయతీలలో యువతకు చేరదీసి ఉల్లాస్ కింద చదివించడం కోసం చొరవ తీసుకోవాలి.
పాండురంగారెడ్డి, యాచారం ఎంఈవో
ఈ వార్తలు కూడా చదవండి:
ఒకటే కార్డు.. మెట్రో, బస్సుల్లో రయ్ రయ్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News