చేజేతులా కాళ్ళు విరగొట్టుకున్నాడు.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:45 AM
రీల్స్ కోసం స్టంట్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు అనేకం ఉంటున్నాయి. అలాంటి వీడియోలు నిత్యం ఎక్కడో అక్కడ చూస్తూనే ఉంటాం. వాటిని చూసి జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: రీల్స్ కోసం స్టంట్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు అనేకం ఉంటున్నాయి. అలాంటి వీడియోలు నిత్యం ఎక్కడో అక్కడ చూస్తూనే ఉంటాం. వీటిని చూసి జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. విషయం తెలిసి కూడా స్టంట్ చేస్తే.. ప్రాణాలకు ముప్పు తప్పదు. అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన 32 ఏళ్ల పుష్పేంద్ర కుమార్ మనౌరియా.. 30 అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహంలోకి దూకాడు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్ళు విరిగిపోయాయి. ఈ ఘటన పహుజ్ డ్యామ్ ప్రాంతంలో జరిగింది.
ఆదివారం పుష్పేంద్ర కుమార్ మనౌరియా తన స్నేహితులతో కలిసి.. ఈ డ్యామ్ వద్దకు చేరుకున్నాడు. అనంతరం డ్యామ్‌పై నుంచి నీటిలోకి పల్టీ కొడుతూ దూకాడు. దీనిని అతడి స్నేహితులు.. సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. అయితే డ్యామ్‌లో నీటి ప్రవాహం చాలా స్వల్పంగా ఉండడం వల్ల.. అతడి రెండు కాళ్లు నేలను గట్టిగా తాకాయి. దీంతో అతడి కాళ్లు విరిగిపోయాయి. అతడు పైకి లేవడానికి ప్రయత్నం చేశాడు. కానీ లేవలేక పోయాడు.
అలా చేతుల సహాయంతో సమీపంలోని రాళ్ల వద్దకు వెళ్లాడు. దీనిపై పోలీసులకు అతడి స్నేహితులు సమాచారం అందించారు. అతడిని పోలీసుల సహాయంలో పైకి తీసుకొచ్చి.. ఆసుపత్రికి తరలించారు. అతడి ఓ కాలికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి.. రెండు స్టీల్ రాడ్లు వేశారు. మరో కాలికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది.
ఈ వీడియోను వేలాది మంది వీక్షించి.. లైక్‌లు కొట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇలాంటి స్టంట్లు చేయడం సర్వదా అనర్థదాయకమని పేర్కొంటున్నారు. ఇలా స్టంట్లు చేస్తూ.. ప్రాణాలు పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రీల్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయవద్దని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
కారు బానెట్‌లో భారీ కొండచిలువ కలకలం..
ఆదోని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి నరసమ్మపై దాడి కేసులో కీలక మలుపు