మెగా డీఎస్సీపై వైసీపీది తప్పుడు ప్రచారం: టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:32 AM
మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను మహిళా ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుని వేలాది ఉద్యోగాలు కల్పించిందని స్పష్టం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 8: మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలేనని టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు విమర్శించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదని, ఇప్పుడు మెగా డీఎస్సీపై మాట్లాడే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 148 రోజుల్లోనే మెగా డీఎస్సీ పూర్తి చేసి 16 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. తమ నియోజకవర్గంలో 30 ఏళ్లుగా మూతపడ్డ కిసాన్ సెజ్‌ను పునరుద్ధరించి కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నామని, చంద్రబాబు విజన్-2047తో యువతకు భరోసా కల్పిస్తున్నారని ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు.
డీఎస్సీపై జగన్‌ది డైవర్షన్ పాలిటిక్స్: ఎమ్మెల్యే గౌతు శిరీష
ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని జగన్.. 150 రోజుల్లో 16 వేల డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన మంత్రి నారా లోకేశ్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. యువగళంలో యువతకు ఇచ్చిన హామీని లోకేశ్ నిలబెట్టుకున్నారని తెలిపారు. డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరిగాయని, నోటిఫికేషన్లు, జీఓలు, రోస్టర్ వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు. స్పోర్ట్స్ కోటాపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని, 431 పోస్టులకు వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలని సవాల్ చేశారు. డీఎస్సీపై తప్పుడు ప్రచారంతో యువతను తప్పుదోవ పట్టించలేరన్నారు. కరోనా సమయంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన వైసీపీకి టీచర్ల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టిందని, మరో మూడు డీఎస్సీలు ఇస్తామని లోకేష్ ప్రకటించారని గౌతు శిరీష పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం తొలి సంతకం డీఎస్సీపైనే..: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వని వైసీపీ నేతలు.. ఇప్పుడు డీఎస్సీపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డీఎస్సీపైనే చేసి.. కేవలం 150 రోజుల్లో 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించి వారి జీవితాల్లో ఆనందం నింపామని తెలిపారు. ఏడాది తర్వాత వైసీపీ డీఎస్సీపై దుష్ప్రచారం చేయడం హేయమని మండిపడ్డారు. 16 వేల మంది జీవితాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీకి వారే గట్టిగా సమాధానం చెబుతారని అన్నారు. ఇప్పటికే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసిన ప్రజలు.. రానున్న రోజుల్లో ఆ పార్టీకి నామరూపాలు లేకుండా చేస్తారని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
ఆదోని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి నరసమ్మపై దాడి కేసులో కీలక మలుపు