ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
ABN , Publish Date - Sep 07 , 2026 | 09:01 AM
ఢిల్లీలో ఐదంతస్తుల హాస్టల్ బిల్డింగ్ కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని సత్యనికేతన్‌లో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని పేర్కొన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'సత్య నికేతన్‌లో హాస్టల్ భవనం కూలిన ఘటన తీవ్రంగా కలచివేసింది. తమ ఆప్తులను కోల్పోయిన వారికి నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని అన్నారు. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
కాగా.. ఆదివారం మధ్యాహ్నం ఓ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. 11 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ భవనం సుమారు 75 పడకల సామర్థ్యంతో పేయింగ్ గెస్ట్(పీజీ) వసతిగా వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన భవనం.. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అక్కడ ఉంటున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ఈ భవనం 40-50 ఏళ్ల నాటిదని, కింది భాగంలో బేస్‌మెంట్‌తో పాటు పైన ఐదంతస్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బేస్మెంట్లో మరమ్మతులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆ పనులకు, భవనం కూలిపోవడానికి మధ్య సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
‘నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నా’.. 14 గంటలు ప్రయాణించిన తండ్రి.!
మంచుకొండపై మానవ వేడి.. 154 టన్నులు కరిగిన మంచు.!