ఉద్యోగం ఉన్నంత మాత్రాన వైకల్యం తక్కువైనట్లు కాదు
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:49 AM
రోడ్డు ప్రమాద నష్టపరిహార కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాధితుల సంపాదన సామర్థ్యాన్ని కేవలం వారు ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్నారనే కోణంలో అంచనా వేయరాదని స్పష్టం చేసింది
రోడ్డు ప్రమాద బాధితురాలికి రూ.3,77,84,297 చెల్లించాల్సిందే
బీమా కంపెనీని ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాద నష్టపరిహార కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాధితుల సంపాదన సామర్థ్యాన్ని కేవలం వారు ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్నారనే కోణంలో అంచనా వేయరాదని స్పష్టం చేసింది. బహిరంగ, పోటీ మార్కెట్‌లో వారి వాస్తవ సంపాదన సామర్థ్యాన్ని బట్టే వైకల్యాన్ని లెక్కించాలని తేల్చిచెప్పింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, వంద శాతం వైకల్యానికి గురైన ఓ మహిళకు పరిహారాన్ని గణనీయంగా పెంచింది. 7.5ు వార్షిక వడ్డీతో కలిపి మొత్తం రూ.3,77,84,297 చెల్లించాలని ఆదేశించింది. 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐబీఎం గ్రూప్ మేనేజర్ ప్రియాంక దాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా తీవ్రమైన ఆరోగ్య స మస్యలను ఎదుర్కొన్నారు. కానీ, ఆమె అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతుండడంతో కిందిస్థాయి ట్రై బ్యునల్ ఆమె వైకల్యాన్ని 60శాతంగా, హైకోర్టు 80 శాతంగా అంచనా వేశాయి. బీమా కంపెనీ మాత్రం ఆమె ఉద్యోగంలో కొనసాగుతున్నారన్న వాదనను తెరపైకి తెచ్చింది. అయితే, బాధితురాలి తరఫు వాదనలను పరిశీలించిన జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టి, జస్టిస్ ఎన్.వి.అంజరియాల ధర్మాసనం బీమా కంపెనీ వా దనను తోసిపుచ్చింది. బాధితురాలు కేవలం యాజమాన్యం కల్పించిన అసాధారణ వెసులుబాట్ల వల్ల మాత్రమే ఉద్యోగంలో నెట్టుకొస్తున్నారని పేర్కొంది. హైకోర్టు అంచనా వేసిన 80 శాతం వైకల్యాన్ని 100 శాతానికి సవరిస్తూ.. భవిష్యత్తు నష్టంతో పాటు వైద్య ఖర్చులు, అటెండెంట్ చార్జీలు, ఇతర నష్టపరిహారాలను కలిపి మొత్తం రూ.3,77,84,297 చెల్లించాలని తుది తీర్పు వెలువరించింది