బతుకునిచ్చే బతుకమ్మ..గునుగుపూల విక్రయంతో ఉపాధి
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:21 PM
బతుకమ్మ వచ్చిందంటే చాలు గునుగు, తంగేడు, బంతి, చేమంతి వంటి పూలకు భలే డిమాండ్ ఉంటుంది. నేడు మహాలయ అమావాస్య బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పల్లెల్లో పూల సందడి నెలకొంది.
పెద్దేముల్(రంగారెడ్డి): బతుకమ్మ వచ్చిందంటే చాలు గునుగు, తంగేడు, బంతి, చేమంతి వంటి పూలకు భలే డిమాండ్ ఉంటుంది. నేడు మహాలయ అమావాస్య బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పల్లెల్లో పూల సందడి నెలకొంది. తొమ్మిది రోజుల వేడుకకు బతుకమ్మను పేర్చేందుకు అవసరమైన గడ్డిపూలైన గునుగు కొందరికి ఉపాధినిస్తోంది. పొలాల్లో పూసిన పూలను కోసి మార్కెట్‌కు తరలించి ఉపాధి పొందుతున్నారు.
పొలాల్లో విరివిగా లభ్యం
పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ నాటకుండానే గునుగు పూలు పెరుగుతాయి. పంటకు నష్టం కలిగిస్తాయని రైతులు మొక్కలు చిన్నగా ఉన్నపుడే వాటిని కలుపుతోపాటు తొలగిస్తుంటారు. కలుపు తీయని పొలాల్లో విరివిగా పెరుగుతుంటాయి. అయితే కొన్ని పొలాల్లో కలుపు తీసిన తర్వాత కూడా పెరుగుతుంటాయి. అలా మొలిచిన మొక్కలే పూలను అందిస్తున్నాయి. బతుకమ్మ పండుగతో కొందరికి ఉపాధిని కల్పిస్తున్నాయి. కొంతమంది కూలీలు బతుకమ్మ పేర్చడానికి అవసరమైన గునుగుపూలు సేకరించి విక్రయిస్తుండడంతో కూలి డబ్బులు గిట్టుబాటవుతున్నాయని చెబుతున్నారు.
కూలీల హర్షం
పెద్దేముల్ మండలంలోని వివిధ గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో ఎర్రరంగు, తెల్లరంగులలో గునుగుపూలు సోయగాన్ని పంచుతున్నాయి. అయితే మండలంలోని తట్టెపల్లి ప్రాంతంలో ఎర్రటి గునుగు పూలు లభిస్తున్నాయి. పెద్దేముల్, జనగాం, రుక్మాపూర్ తదితర ప్రాంతాల్లో మాత్రం తెల్లటిపూలు లభిస్తాయి. గునుగుపూలు ఎక్కడ ఉన్నాయనే విషయం తెలుసుకొని కొందరు కూలీలు వాటిని సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు. బతుకునిచ్చే బతుకమ్మ పండగ తమకు కొంత ఉపాధి కల్పిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పూలకు రంగులు అద్ది విక్రయిస్తాం
ఏటా బతుకమ్మ పండగ సీజన్‌లో గునుగుపూలు సేకరిస్తాం. గునుగుపూలకు హైదరాబాద్ పట్టణంలో మంచి డిమాండ్ ఉంటుంది. సేకరించిన గునుగుపూలను కత్తిరించి వాటిని వివిధ రంగుల్లో అద్దుతాం. తర్వాత వాటిని ఆరబెట్టి హైదరాబాద్‌కు తరలిస్తాం. గునుగుపూల విక్రయంతో రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు ఆదాయం వస్తుంది. మార్కెట్‌కు పూలు ఎక్కువగా వచ్చిన సమయంలో మాత్రం ధరలు తగ్గిపోయి ఆదాయం పడిపోతుంది.
అశప్ప, తాండూరు
ఈ వార్తలు కూడా చదవండి:
తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి
రహస్యంగా వైద్యం చేయించుకుంటున్న కేటీఆర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News