స్టార్‌లింక్ లైసెన్స్ వివాదం.. కమల్ హాసన్‌కు మద్దతుగా కంగనా రనౌత్
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:29 AM
భారతదేశంలో స్టార్‌లింక్ లైసెన్సింగ్ జాప్యంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన విమర్శలు దేశీయంగా పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Starlink licence row: భారతదేశంలో స్టార్‌లింక్ (Starlink) ప్రవేశం, లైసెన్సింగ్ జాప్యంపై టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) చేసిన విమర్శలు దేశీయంగా పెద్ద రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
భారతీయ విధానాలపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని తప్పుబడుతూ కమల్ హాసన్ చేసిన ట్వీట్‌ను షేర్ చేసిన కంగనా.. 'ఏ విదేశీ లేదా భారతీయ బిలియనీర్ కూడా మన దేశ విధానాలను శాసించలేరు' అని స్పష్టం చేశారు.
కమల్ హాసన్ స్పందనను ప్రశంసిస్తూ కంగనా ఎక్స్ (X) వేదికగా స్పందించారు. 'అవును! ఇది తగలాల్సిందే @elonmusk. భారత్ లేదా అమెరికా.. ఏ దేశానికి చెందిన బిలియనీర్ అయినా మన దేశ విధానాలను డిక్టేట్ చేయలేరు. చాలా చక్కగా, సూటిగా, వ్యంగ్యంగా వివరించారు' అంటూ కమల్ హాసన్‌ను కంగనా కొనియాడారు.
ఎలాన్ మస్క్ ఆరోపణలు - కమల్ హాసన్ కౌంటర్
భారత్‌లో మార్కెట్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కొందరు శక్తివంతమైన వ్యాపార ప్రముఖులు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని, ముంబైకి చెందిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీయే భారతదేశానికి 'నిజమైన బాస్' అంటూ మస్క్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
దీనిపై కమల్ హాసన్ బదులిస్తూ.. 'భారత్ ఒక వలస దేశం కాదు, సమున్నత ప్రజాస్వామ్యం. ప్రపంచాన్ని మేము స్వాగతిస్తాము, కానీ మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటాము' అని తేల్చిచెప్పారు.
జాతీయ భద్రత, దేశీయ ప్రయోజనాలు
టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్, స్పెక్ట్రమ్ కేవలం వాణిజ్య ఆస్తులు కాదని, అవి దేశ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నాయని కమల్ హాసన్ గుర్తుచేశారు. అమెరికా కూడా చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై 100శాతం సుంకాలు విధించడం, హువావే (Huawei) సంస్థపై భద్రతాపరమైన ఆంక్షలు విధించడం వంటి చర్యల ద్వారా తన దేశీయ ప్రయోజనాలను కాపాడుకుంటోందని ఉదాహరించారు.

ప్రభుత్వ స్పష్టత
భారతదేశ లైసెన్సింగ్ విధానాలు పక్షపాతంతో కూడుకున్నవి కాదని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. స్టార్‌లింక్‌తో పాటు జియో శాట్‌కామ్, ఎయిర్‌టెల్-యుటెలాట్ వన్‌వెబ్ వంటి సంస్థలన్నీ కూడా వాణిజ్య సేవలను ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా భద్రతా తనిఖీలను పూర్తి చేసి, స్పెక్ట్రమ్ అనుమతులు పొందాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు