8 నోబెల్ శాంతి బహుమతులకు నేను అర్హుడిని: ట్రంప్
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:18 AM
నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నార్వేపై ఆయన తీవ్ర అక్కసు వెళ్ళగక్కారు. వాస్తవానికి తాను చాలా యుద్ధాలను ఆపానని పేర్కొన్నారు. తనకు 8 సార్లు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, ఇందుకు తాను అర్హుడిని చెప్పారు.
ఇంటర్‌నెట్ డెస్క్: నోబెల్ శాంతి బహుమతికి తనను ఎంపిక చేయకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నార్వేపై ఆయన తీవ్ర అక్కసు వెళ్ళగక్కారు. వాస్తవానికి తాను చాలా యుద్ధాలను ఆపానని పేర్కొన్నారు. తనకు 8 సార్లు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, ఇందుకు తాను అర్హుడిని చెప్పారు. సైరక్యూస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకుండా 5 కోట్ల మందిని కాపాడానని అన్నారు. అంతేకాకుండా అణ్వాయుధాలు సంపాదించుకోకుండా ఇరాన్‌ను అడ్డుకున్నానని పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్‌ను తాను అడ్డుకోకపోయుంటే, పశ్చిమాసియాను ఇరాన్ ఎప్పుడో అంతం చేసుండేదన్నారు. తాను కాపాడినన్న ప్రాణాలను చరిత్రలో మరెవ్వరూ కాపాడలేదన్నారు.
‘‘నేను నడుపుతున్న అమెరికాకు అయినా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చి ఉండాల్సింది. కానీ రాలేదు. ఇది నార్వేపై మాయని మచ్చగా మిగిలిపోతుంది. నోబెల్ కమిటీ వారు చాలా అవమానకరమైన నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది రాడికల్ భావజాలం కలిగిన వారు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, నాగరిక శత్రువులు నోబెల్ శాంతి బహుమతిని అవమానించారు. నార్వేను మేము మర్చిపోం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను పరిష్కరించిన వివాదాల జాబితా గురించి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు కూడా త్వరలో ముగిసేలా చూస్తానని చెప్పారు. ఇక నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన సౌతాఫ్రికాకు చెందిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ చీఫ్ నవీ పిళ్లైపైనా ట్రంప్ ఇంతకుముందు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఎవరో అనామకురాలికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన ఎవరో పిళ్లై అంట. అలాంటి ఆమెకు నోబెల్ ఇచ్చారు. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
‘ఢిల్లీని స్తంభింపజేయడం సమంజసమేనా?’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేరళ మాజీ సీఎం విజయన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం