Share News

జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం

ABN , Publish Date - Oct 09 , 2026 | 02:05 PM

అమెరికాలో విదేశీ వర్కర్లను వెట్టిచాకిరీ చేసే సేవకులుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వర్ణించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిపుణుల వలసలతో ఇరు దేశాలకు లాభం కలుగుతోందన్న విషయం మర్చిపోవద్దని పేర్కొంది.

జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం
India Responds to JD Vance Comments

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో విదేశీ వర్కర్లను వెట్టిచాకిరీ చేసే సేవకులుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వర్ణించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిపుణుల వలసలతో ఇరు దేశాలకు లాభం కలుగుతోందన్న విషయం మర్చిపోవద్దని పేర్కొంది. వలసలతో అమెరికా కంపెనీలకు సృజనాత్మకత, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగకల్పనల్లో ప్రయోజనం కలుగుతోందని చెప్పింది. వలసలతో అమెరికా పెట్టుబడిదారుల సంపద కూడా పెరుగుతోందని గుర్తు చేసింది. గ్రీన్ కార్డుపై ఇటీవల అమెరికా విధించిన పరిమితుల నేపథ్యంలో వాన్స్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.


పర్మ్ ప్రోగ్రామ్‌ నుంచి భారత ఐటీ దిగ్గజాలతో పాటు మైక్రోసాఫ్ట్‌ను అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే. కంపెనీలు ఉద్యోగులకు స్పాన్సర్ చేసే గ్రీన్ కార్డు ప్రక్రియకు సంబంధించి పర్మ్ ప్రోగ్రామ్‌ను కీలక దశగా భావిస్తారు. అయితే, పర్మ్ ప్రోగ్రామ్, హెచ్-1బీ వీసా వేటికవే భిన్నమైనవని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా తాజా ఆదేశాలతో ప్రస్తుత హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబసభ్యులపై ప్రభావం ఉండదని పేర్కొంది. అయితే, గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారిపై ప్రభావం ఉంటుందని చెప్పింది. ఈ సందర్భంగా వాన్స్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చేసింది. ఆ కామెంట్స్‌లో వలసవాద భావనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. అనేక తరాల వలసలతో అమెరికా రూపుదిద్దుకున్న విషయాన్ని భారత్ ప్రస్తావించింది.


మైక్రోసాఫ్ట్‌కు పర్మ్‌ ప్రోగ్రామ్ నుంచి తొలగిస్తూ వాన్స్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అమెరికా ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అమెరికన్ల స్థానంలో వెట్టిచాకిరీ చేసే విదేశీ కార్మికులను తీసుకురావొద్దని వ్యాఖ్యానించారు. గతేడాది మైక్రోసాఫ్ట్ 6 వేల మంది అమెరికన్ వర్కర్లను తొలగించిందని అన్నారు. అదే సమయంలో 6300 హెచ్-1బీ వీసాలు పొంది లాభపడిందని చెప్పారు. కంపెనీ దరఖాస్తు చేసుకున్న 3 వేల గ్రీన్ కార్డులకు ఆమోదం లభించిందని చెప్పారు. ఒక్కో అమెరికన్ వర్కర్ స్థానంలో సగటున ఒకటిన్నర విదేశీ వర్కర్లను నియమించుకుందని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలనూ చదవండి:

61 ఏళ్ల వయసులో మహిళ ప్రపంచ రికార్డు.. 5 గంటల పాటు ప్లాంక్

ఏఐని నమ్మి కొండెక్కాడు.. మధ్యలో షాకింగ్ ట్విస్ట్..

Updated Date - Oct 09 , 2026 | 02:39 PM