ఏఐని నమ్మి కొండెక్కాడు.. మధ్యలో షాకింగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Oct 09 , 2026 | 08:37 AM
ఏఐ సూచించిన మార్గాన్ని నమ్మి హైకింగ్‌కు వెళ్లిన ఓ యువకుడు ప్రాణాపాయంలో చిక్కుకున్నాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో 16 ఏళ్ల బ్రైస్ విన్సెంట్ గౌరిలుక్.. క్రౌన్ పర్వతంపై దారి తప్పి ప్రమాదకరమైన కొండ అంచున చిక్కుకుపోయాడు..
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఏఐ (AI) సాయంతో హైకింగ్ మార్గాన్ని ప్లాన్ చేసుకున్న ఓ 16 ఏళ్ల యువకుడు చివరకు ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నాడు. క్రౌన్ పర్వతాన్ని అధిరోహించేందుకు బయలుదేరిన బ్రైస్ విన్సెంట్ గౌరిలుక్.. ఏఐ అసిస్టెంట్ క్లాడ్ సూచనలు, గూగుల్ మ్యాప్స్ వంటి ఇతర సాధనాలను ఉపయోగించాడు. అయితే.. మార్గాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక హైకింగ్ ట్రయల్ నుంచి దూరంగా వెళ్లిపోయాడు. చివరకు పర్వతంపై దాదాపు నిలువుగా ఉన్న ప్రమాదకరమైన కొండ అంచున చిక్కుకుపోయాడు. అక్కడి నుంచి కిందపడితే తీవ్ర గాయాలు కావడం లేదా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని సహాయక సిబ్బంది వెల్లడించారు. దీంతో అతడు పోలీసులకు ఫోన్ చేయగా.. వారు నార్త్ షోర్ రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. హెలికాప్టర్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. బ్రైస్ చిక్కుకున్న ప్రాంతంలో హెలికాప్టర్ నేరుగా దిగేందుకు అవకాశం లేకపోవడంతో.. సిబ్బంది తాళ్ల సహాయంతో అతడిని చేరుకున్నారు. అనంతరం తగిన భద్రతా ఏర్పాట్లు చేసి.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అనువైన ప్రాంతానికి తరలించారు. సమాచారం అందిన సుమారు మూడు గంటల తర్వాత అతడిని హెలికాప్టర్‌లోకి ఎక్కించి క్లీవ్‌ల్యాండ్ డ్యామ్ సమీపంలోని సహాయక స్థావరానికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో తాను ఏఐని నిందించడం లేదని బ్రైస్ పేర్కొన్నప్పటికీ.. హైకింగ్ మార్గాలను ప్లాన్ చేసుకునేటప్పుడు కృత్రిమ మేధపై మాత్రమే ఆధారపడవద్దని నార్త్ షోర్ రెస్క్యూ సెర్చ్ మేనేజర్ పాల్ మార్కీ సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!