జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!
ABN , Publish Date - Oct 09 , 2026 | 06:18 AM
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశీల సమీపంలోని చారిత్రక సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోంచి ముందుగానే బయట పడింది.
కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడ్డ సంగమేశ్వర ఆలయం
ఎల్‌నినో ప్రభావంతో ముందుగానే దర్శనం
25 ఏళ్ల చరిత్రలో మూడోసారి!
కొల్లాపూర్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశీల సమీపంలోని చారిత్రక సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోంచి ముందుగానే బయట పడింది. సాధారణంగా వేసవి ఆరంభంలో కనిపించే ఈ పురాతన శైవ క్షేత్రం.. ఈ ఏడాది అక్టోబరులోనే భక్తులకు దర్శనమిస్తోంది. ఇలా ఇంత ముందుగానే ఆలయం జలాధివాసం నుంచి బయటపడటం గత 25ఏళ్లల్లో ఇది మూడోసారి మాత్రమేనని ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘు రామయ్య శర్మ తెలిపారు. 2002, 2015, 2026 సంవత్సరాల్లో మాత్రమే పవిత్ర కార్తీకమాసం వేళ భక్తులకు సంగమేశ్వర స్వామి దర్శనభాగ్యం కలిగిందన్నారు. సాధారణ పరిస్థితుల్లో ఈ ఆలయం ఏడాదిలో సుమారు ఎనిమిది నెలల పాటు శ్రీశైల జలాశయ నీటిలో మునిగి ఉండి, నాలుగు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. అయితే, ఎల్‌నినో ప్రభావం, రుతుపవనాల గమనంలో మార్పుల వల్ల కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో వరదలు రాకపోవడం, శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పడిపోవడంతో ఈ అరుదైన దృశ్యం అక్టోబరు నాటికే సాక్షాత్కరించింది. దీంతో ఈ సప్త నదుల సంగమక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆలయం జలాధివాసం వీడిందన్న వార్త తెలియగానే ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ గోపురానికి సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.