హైడ్రా బూచిగా అక్రమ వసూళ్లు
ABN , Publish Date - Oct 09 , 2026 | 06:10 AM
హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు, అక్రమ నిర్మాణాలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో తెచ్చిన హైడ్రాను కొందరు అధికారులు అక్రమార్జనకు బూచిగా మార్చుకుంటున్నారు.
అనుమతి లేని భవనాలను హైడ్రాతో కూల్చివేయిస్తామని అధికారుల బెదిరింపులు
భవన నిర్మాణదారుల నుంచి లక్షల్లో వసూలు..
మాట వినని బిల్డర్ల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్‌రిజిస్ట్రార్లకు లేఖలు
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో కొందరి లాభసాటి బేరాలు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు, అక్రమ నిర్మాణాలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో తెచ్చిన హైడ్రాను కొందరు అధికారులు అక్రమార్జనకు బూచిగా మార్చుకుంటున్నారు. అనుమతి లేని భవన నిర్మాణాలను అడ్డుకోవాల్సిన వారే.. వాటిని చక్కటి ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నట్లు ఇటీవల ఏసీబీ దాడుల్లో బయటపడింది. ఇటీవల గోల్కొండ జోన్‌లో టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ తులసిరాం సునీత ఓ బిల్డర్ నుంచి రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆమెను విచారించిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. మెహిదీపట్నం సర్కిల్‌లో ఓ వ్యక్తి అనుమతి లేకుండా నాలుగంతస్తుల భవనం నిర్మించటంతో జీహెచ్‌ఎంసీ చట్టం 1955, సెక్షన్ 452 ప్రకారం టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అతడు అనుమతి పత్రాలు సమర్పించకపోవడంతో చివరకు స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశారు. దీని ప్రకారం జోనల్ కమిషనర్ వద్ద ఆ బిల్డర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అధికారులు అతడిని దారికి తెచ్చుకొనేందుకు హైడ్రాకు సమాచారమిచ్చి మొత్తం భవనం నేలమట్టం చేయిస్తామని బెదిరించినట్టు తెలిసింది. దీంతో హడలిపోయిన నిర్మాణదారుడు రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని మొదటి విడతగా రూ.4 లక్షలు సూపర్‌వైజర్ సునీతకు లంచం ఇస్తుండగా ఏసీబీ పట్టుకుంది. అక్రమ నిర్మాణానికి సంబంధించి విచారణ స్పీకింగ్ ఆర్డర్ దశకు వచ్చిన తరువాత కూడా తదుపరి చర్యలు తీసుకోకుండా చూసుకుంటామని అధికారులు భవన యజమానితో సంప్రదింపులు జరపడం గమనార్హం.
అడిగినంత ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్లు కానివ్వం..
అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ పూర్తిస్థాయిలో నేలమట్టం చేయదు. శ్లాబ్‌లకు రంధ్రాలు చేసి, గోడలు కూలుస్తారు. అనంతరం బిల్డర్లు అధికారులను మేనేజ్ చేసి తిరిగి పనులు చేపడతారు. దీంతో కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారులు బిల్డర్లను బెదిరించేందుకు హైడ్రాను బూచిగా చూపుతున్నారు. హైడ్రాకు సమాచారం ఇస్తే మొత్తం భవనాన్ని కూల్చివేస్తుందని బెదిరించి లక్షల్లో వసూలు చేస్తున్నారు. మరోవైపు అడిగినంత ఇవ్వటానికి నిరాకరించే వారిపై రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖలు రాసి ఆ ఆస్తులు రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకుంటున్నారు. ఇటీవల ఓ జోన్‌లో గ్రౌండ్ ప్లస్ రెండంతస్తులకు అనుమతి తీసుకొన్న ఓ వ్యక్తి.. అదనంగా మరో రెండంతస్తులు నిర్మించాడు. అప్పటికే పలువురు అధికారులకు భారీగా ముట్టచెప్పిన అతడు.. కొత్తగా వచ్చిన ఏసీపీ డిమాండ్ చేసినంత లంచం ఇవ్వలేకపోయాడు. దీంతో ఆయన స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌కు లేఖ రాసి ఆ భవనం రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని కోరాడు. ఆ జోన్‌లో అనేక అక్రమ నిర్మాణాలున్నా.. ఆ ఒక్క భవనాన్ని మాత్రమే నిషేధిత జాబితాలో పెట్టించడం గమనార్హం. శేరిలింగంపల్లి జోన్‌లో ఓ అధికారి అనుమతి లేని నిర్మాణంపై హైడ్రాకు సమాచారం ఇస్తామని బెదిరించి రూ.6 లక్షలు వసూలు చేశాడని ప్రచారం జరుగుతోంది.