Share News

61 ఏళ్ల వయసులో మహిళ ప్రపంచ రికార్డు.. 5 గంటల పాటు ప్లాంక్

ABN , Publish Date - Oct 09 , 2026 | 10:49 AM

వయసు 61 ఏళ్లు.. కానీ పట్టుదల ముందు వయసు కూడా చిన్నబోయింది! కెనడాకు చెందిన డోనా జీన్ వైల్డ్ అనే మహిళ ఏకంగా ఐదు గంటల పాటు ప్లాంక్ భంగిమలో ఉండి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో తానే నెలకొల్పిన రికార్డును అధిగమించి మరోసారి తన సత్తా చాటారు.

61 ఏళ్ల వయసులో మహిళ ప్రపంచ రికార్డు.. 5 గంటల పాటు ప్లాంక్
Donna Jean Wilde

ఇంటర్నెట్ డెస్క్: వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని కెనడాకు చెందిన 61 ఏళ్ల డోనా జీన్ వైల్డ్ అనే మహిళ నిరూపించారు. కఠోర శ్రమ, పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా అద్భుతాలు సాధించవచ్చని చాటిచెప్పారు. ఏకంగా ఐదు గంటల పాటు ప్లాంక్ భంగిమలో ఉండి మహిళల విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. హంట్స్‌మన్ వరల్డ్ సీనియర్ గేమ్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఆమె ఘనతకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. అందులో డోనా వేదికపై ప్లాంక్ చేస్తుండగా.. ఐదు గంటల సమయం పూర్తయ్యే వేళ ప్రేక్షకులు కౌంట్‌డౌన్ చేస్తూ ఆమెను ఉత్సాహపరిచారు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ప్లాంక్‌ను విరమించుకున్న డోనాను అక్కడున్నవారు చప్పట్లతో అభినందించారు. ఈ వయసులోనూ ఆమె ప్రదర్శించిన శారీరక దృఢత్వం.. అసాధారణ ఓర్పు అందరినీ ఆశ్చర్యపరిచాయి.


డోనా జీన్ వైల్డ్‌కు ప్లాంక్‌లో ప్రపంచ రికార్డులు సాధించడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2024 మార్చి 21న కెనడాలోని అల్బెర్టాలో 4 గంటల 30 నిమిషాల 11 సెకన్ల పాటు అబ్డామినల్ ప్లాంక్ భంగిమలో ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. తాజాగా.. దాదాపు ఐదు గంటల పాటు ప్లాంక్ చేసి తన గత రికార్డును అధిగమించారు. ఈ ఘనతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. నెటిజన్లు ఆమె ఫిట్‌నెస్‌ను.. పట్టుదలను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. తాము కనీసం రెండు నిమిషాల పాటు కూడా ప్లాంక్ చేయలేమని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తుండగా.. మరికొందరు డోనాను స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. 61 ఏళ్ల వయసులో ఆమె సాధించిన ఈ ఘనత ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారికి ప్రేరణగా నిలుస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

హైడ్రా బూచిగా అక్రమ వసూళ్లు

జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!

Updated Date - Oct 09 , 2026 | 11:00 AM