Share News

తరతరాల జ్ఞాపకాల వారధి పెత్తర అమావాస్య

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:44 AM

మహా అంటే గొప్పది, ఆలయం అంటే నివాసం. పితృ దేవతలందరూ ఒక్కచోట చేరే పవిత్ర సమయమే మహాలయం.

తరతరాల జ్ఞాపకాల వారధి పెత్తర అమావాస్య
pettara amavasya

  • ‘పెద్దల’యాదిలో..

  • పెద్దలకు బియ్యమిచ్చుడు ఆనాదిగా వస్తున్న ప్రత్యేక సంప్రదాయం

  • కుటుంబ మూలాలను, పూర్వీకుల సేవల స్మరణ

  • తర్పణాలు, పిండప్రదానాలు..

  • నేడు మహాలయ అమావాస్య

దుబ్బాక/జోగిపేట(మెదక్): పెద్దల ఫొటోకు బొట్టు.. పక్కనే బియ్యం, పప్పు, చింతపండు.. సాటలో మొక్కజొన్న కంకులు, పల్లీలు, దోసకాయలు.. ఇంట్లో పెద్దలకు ఇష్టమైన పిండివంటలు, తీపి పదార్థాలు.. తెల్లవారుజామునే ఇంటిల్లిపాదీ తలస్నానాలు చేసి, వంటింట్లో ప్రత్యేక వంటకాలతో సందడి చేయడం.. పూజ పూర్తయ్యే వరకు పిల్లలు ఏమీ తినకుండా పెద్దల జాగ్రత్తలు చెప్పడం.. చివరికి తీర్థం, పప్పు, చక్కెర ప్రసాదంగా స్వీకరించడం.. ఇంట్లో లేని పెద్దలను పేరుపేరునా తలుచుకుంటూ వారి జ్ఞాపకాల్లో మునిగిపోవడం.. పల్లెల్లో తరతరాలుగా కొనసాగుతున్న‘పెద్దలకు బియ్యమిచ్చుడు’ సంప్రదాయమిది. ఆస్తిపాస్తులు వెంట తీసుకెళ్లలేం కానీ.. మనం జీవించి ఉన్నప్పుడు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టామా.. ఆపదలో ఉన్నవారికి తోడుగా నిలిచామా.. కుటుంబ పెద్దలను గౌరవించామా అన్నదే మనిషి జీవితానికి మానవీయ అర్థాన్ని ఇస్తుంది. పెద్దలకు బియ్యమిచ్చుడు వెనుక కూడా ఇలాంటి భావన కనిపిస్తుంది.


medak.jpgఅద్దంలో ఆత్మస్వరూపం

ఈ శనివారం మహాలయ అమావాస్య (పెత్తరామావాస్య) కావడంతో పల్లెల్లో ఈ పర్వదిన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నా, పల్లె సంస్కృతిలో ఈ ఆచారం తన విశిష్టతను నేటికీ నిలుపుకుంటోంది. ఫొటోలు లేని కాలంలో కొన్ని కుటుంబాల్లో పెద్దలకు ప్రతీకగా అద్దాన్ని నిలిపే సంప్రదాయం ఉండేది. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో ఈ పద్ధతి కనిపిస్తుంది. అద్దానికి బొట్టు పెట్టి, పితృదేవతలను స్మరించుకుంటూ బియ్యం, పిండివంటలు, ఇతర పదార్థాలను సమర్పిస్తారు. అద్దం ముందు నిలబడి తమ పూర్వీకులను తలుచుకుంటూ.. తమ రూపాన్ని చూసుకోవడం ద్వారా తమ మూలాలను దర్శించుకునే భావనను పొందుతారు.


సాటలో పల్లె పంటల పరిమళం

పెత్తరామావాస్య సందర్భంగా పెట్టే ‘సాట’లో కనిపించే పదార్థాలు పల్లె వ్యవసాయ జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. మొక్కజొన్న కంకులు, పల్లీలు, దోసకాయలు, చింతపండు, చేల గట్లపై లభించే పదార్థాలను పెద్దలకు సమర్పిస్తారు. వీటిని గ్రామ పౌరోహితుడికి, జంగమయ్య కుటుంబానికి లేదా శివాలయాల్లోని అర్చకులకు అందజేస్తారు. పితృపక్షంలో పెద్దలు తమ కుటుంబాలను చూడటానికి వస్తారని, తమకు ఇష్టమైన వంటకాలను స్వీకరించి దీవిస్తారని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు.


medak1.jpgమహాలయం.. శ్రాద్ధ తర్పణాల పవిత్ర కాలం

మహా అంటే గొప్పది, ఆలయం అంటే నివాసం. పితృ దేవతలందరూ ఒక్కచోట చేరే పవిత్ర సమయమే మహాలయం. భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పితృపక్షాలు అంటారు. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య లేదా పితృ అమావాస్య అని పిలుస్తారు. ఏడాదిలో ఏ రోజున శ్రాద్ధ కర్మలు నిర్వహించలేకపోయినా, ఈ అమావాస్య నాడు పితృదేవతలను తలచుకుని నువ్వులు, నీటితో తర్పణం వదిలి, పిండ ప్రదానం చేస్తే వారు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు నదులు, చెరువులు, పవిత్ర జలాశయాల వద్దకు చేరుకుని స్నానాలు ఆచరించి తర్పణాలు సమర్పిస్తారు. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దానధర్మాలు చేస్తారు.


దేవీ నవరాత్రుల ప్రారంభం

మహాలయ అమావాస్యతో పితృపక్షాలు పూర్తవుతాయి. మరుసటి రోజు(ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి) నుంచి దేవీనవరాత్రులు ప్రారంభమవుతాయి. చీకటి లాంటి పితృపక్షాలు ముగిసి, అమ్మవారి వెలుగుల రూపంలో ఉత్సవాలు మొదలవుతాయని నమ్మకం.


ఈ వార్తలు కూడా చదవండి:

చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 11:44 AM