నువ్వు.. నీ వాళ్లు.. ఓ హెల్మెట్
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:29 AM
హెల్మెట్ అంటే కేవలం తలకు పెట్టుకునే సాధనం కాదు అది ప్రాణాలకు కవచం అని వైద్యులు, పోలీసులు చెబుతున్నారు.
హెల్మెట్ బరువు కాదు.. బాధ్యత
నిజామాబాద్ రోడ్లపై యువత నిర్లక్ష్యం
తరచూ రోడ్డు ప్రమాదాలు
తలకు తగిలే గాయాలే అధికం
ఏడాది 276 మంది దుర్మరణం
715 మందికి గాయాలు
తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు
ఆస్పత్రుల్లో విషాద దృశ్యాలు
నేడు నేషనల్ సేఫ్టీ డే
నిజామాబాద్: హెల్మెట్ అంటే కేవలం తలకు పెట్టుకునే సాధనం కాదు అది ప్రాణాలకు కవచం అని వైద్యులు, పోలీసులు చెబుతున్నారు. రోడ్డు మీద వేగంగా దూసుకెళ్తున్న ప్రతి బైక్ వెనుక ఒక కుటుంబ ఆశలు పయాణిస్తున్నాయని, ఒక్క క్షణం అజాగ్రత్త ఆ ఆశలన్నిటినీ ఛిన్నాభిన్నం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో ఆసుపత్రులలో చేరుతున్న రోడ్డు ప్రమాద బాధితులలో ఎక్కువమంది హెల్మెట్ లేకుండానే ఉంటున్నారనేది పోలీసు లు చెబుతున్న విషయాలు. తలకు బలమైన గాయం అయితే వైద్యులు సైతం చేసేదేమిలేదు. చిన్న దూరమే అనుకుని హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్న యువకులు ప్రమాదాల బారినపడుతూ ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెడుతున్నారు. నేడు నేషనల్ సేఫ్టీడే సందర్భంగా హెల్మెట్ ప్రాముఖ్యతను ప్రతీఒక్కరు గుర్తుచేసుకోవాల్సిన సమయం ఎంతైన ఉంది. జిల్లాలో గత యేడాది కాలంలో 780 ప్రమాదాలు జరగగా 276 మంది మృతిచెందగా 715 మంది గాయాలపాలైనట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో 265 ప్రమాదాలు ప్రాణాంతకంగా పోలీసులు ధ్రువీకరించారు.
ప్రమాదాల పెరుగుదల.. బలవుతున్న యువత
జిల్లాలో ఏదో ఒకచోట రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు, బైపాస్ రోడ్లు, నగర శివారు ప్రాంతాలలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, హెల్మెట్ లేకపోవడం ప్రమాదాలలో ఎక్కువమంది చనిపోవడానికి కారణాలుగా పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా 18-35 సంవత్సరాల వయసు గల యువకులే రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బైక్‌పై వెళ్తూ ప్యాషన్‌గా భావించి హెల్మెట్‌లు పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలలో తలకు తీవ్ర గాయాలై ఎక్కువమంది మృత్యువాత పడుతున్నారు. ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉండడం, జీవితాంతం ఆ కుటుంబాలకు తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నాయి.
చట్టం కఠినమే కానీ చైతన్యం అవసరం
మోటార్ వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అయినప్పటికి అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విదిస్తున్నప్పటికి వాహనదారుల్లో మాత్రం హెల్మెట్ వాడడంపై ఇంకా పూర్తిస్థాయిలో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెల్మెట్‌ను పోలీసుల నుంచి జరిమానాలు చూసి పెట్టుకోవడమే తప్పా ప్రాణాలు కాపాడుతుందనే స్ప్రహనేటి యువతలో కనిపించడంలేదు. జరిమానాల భయం కొద్ది రోజులే ఉంటుంది. కానీ ప్రాణనష్టం శాశ్వతం అని అదికారులు చెబుతున్నారు. చట్టంకంటే మన ప్రాణం విలువైనదనే భావన సమాజంలో పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కుటుంబాల కంటతడి మార్పు ఎప్పుడో
ఒక్క ప్రమాదం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా మానసికంగా కుదేలు చేస్తుంది. ఆశలతో ఎదురుచూసే తల్లిదండ్రులు, భార్య పిల్లలు శవపేటిక ఎదురువచ్చే ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తల్లిదండ్రులు, భార్యపిల్లల భవిష్యత్తు ఒక్కసారిగా అందకారంలోకి జారీపోతుంది. హెల్మెట్ ఉంటే ఇతర గాయాలై ప్రాణాలు రక్షించుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో చైతన్యం తీసుకురావాలని పోలీసులు సూచిస్తున్నారు. హెల్మెట్ అలవాటు అయితేనే నిజమైన సేఫ్టీ డే జరుపుకున్నట్లు అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇకనైన వాహనదారుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News