వేడెక్కుతున్న రాష్ట్రం
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:55 AM
రాష్ట్రంలో వాతావరణం క్రమేపీ వేడెక్కుతోంది. మార్చి మొదటి వారంలోనే మాడు పగిలే ఎండలు కాస్తున్నాయి.
కర్నూలులో 39 డిగ్రీలు నమోదు.. సీమ, దక్షిణ కోస్తాల్లో మరింత పెరగనున్న ఎండలు
విశాఖపట్నం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వాతావరణం క్రమేపీ వేడెక్కుతోంది. మార్చి మొదటి వారంలోనే మాడు పగిలే ఎండలు కాస్తున్నాయి. గడచిన నాలుగైదు రోజులుగా వాయవ్య, మధ్య భారతంలో ఒక్కసారిగా ఎండలు పెరిగాయి. దీనికితోడు మధ్య భారతంలో కొనసాగుతున్న అధికపీడనం ప్రభావంతో వాయవ్య భారతం నుంచి వేడి గాలులు రాష్ట్రంపైకి వీస్తున్నాయి. దీంతో గడచిన నాలుగు రోజులుగా దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రాయలసీమలో నమోదయ్యాయి. మంగళవారం కర్నూలులో 39 డిగ్రీలు, నందిగామలో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుండగా దక్షిణ తమిళనాడు దానికి ఆనుకుని గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం దిశగా పొడిగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఎండలు మరింతగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతాయి. ఒకటి, రెండు చోట్ల 39, 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.