మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కారుకు ప్రమాదం..
ABN , Publish Date - Jun 06 , 2026 | 02:30 PM
కామారెడ్డి జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
కామారెడ్డి, జూన్6 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో ఈరోజు (శనివారం) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా (Bigala Ganesh Gupta) త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ సమీప జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ గణేశ్ గుప్తా వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన లారీ బిగాల గణేశ్ గుప్తా ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అనంతరం వాహనం సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ కారులో ప్రయాణిస్తున్న మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు, అభిమానులు మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు
పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News