Share News

ఆ ముగ్గురు ఎక్కడా..!

ABN , Publish Date - Feb 26 , 2026 | 01:53 PM

ఉమ్మడి మెదక్‌ జిల్లా అంటే తెలంగాణ ఉద్యమ గడ్డగానే చాలామందికి తెలుసు. కానీ అంతకుముందే విప్లవ పోరాటాలకు అడ్డాగా మెతుకుసీమ నిలిచింది.

ఆ ముగ్గురు ఎక్కడా..!

  • 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి..

సంగారెడ్డి: ఉమ్మడి మెదక్‌ జిల్లా అంటే తెలంగాణ ఉద్యమ గడ్డగానే చాలామందికి తెలుసు. కానీ అంతకుముందే విప్లవ పోరాటాలకు అడ్డాగా మెతుకుసీమ నిలిచింది. నక్సల్బరి నేపథ్యం, పీపుల్స్‌వార్‌, జనశక్తి, ప్రస్తుత మావోయిస్టు ఉద్యమాలతో ఉమ్మడి మెదక్‌ జిల్లా, హుస్నాబాద్‌, చేర్యాల ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది. దుబ్బాక, నర్సాపూర్‌, గిరాయిపల్లి, ఇందుప్రియాల్‌, భూపతి, పద్మక్క దళాలుగా ఇక్కడ పీపుల్స్‌వార్‌ పనిచేసింది. అదే విధంగా కూడవెల్లి, మంజీర దళాలతో జనశక్తి హవా నడిచింది.


ఒక్కరు సరే.. ఆ ఇద్దరేరి?

తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ సహ మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహరెడ్డి లొంగిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసు వర్గాల నుంచి కొన్ని విషయాలు తేటతెల్లమయ్యాయి. తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో 11 మంది మాత్రమే ఉన్నారని సమాచారం ఇచ్చారు. ఇందులో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగబోయిన భాగ్య అలియాస్‌ రూపీ పేరు వెల్లడైంది. ఈమె చత్తీస్ఘ డ్‌ రాష్ట్రంలోని నార్త్‌బస్తర్‌ ఏరియా కమాండర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. 23 ఏళ్ల క్రితమే అజ్ఞాతబాట పట్టినట్లు ధర్మారంలోనూ చెబుతున్నారు.


ఇక అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన కాశబోయిన స్వరూప 25ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లింది. దండకారణ్యం సభ్యురాలిగా ఉన్న ఆమెపై రూ.2లక్షల వరకు రివార్డు ఉన్నట్లు గతంలో పోలీసులు పేర్కొన్నారు. తన చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోతే నానమ్మ, తాత వద్ద పెరిగింది. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమానికి ఆకర్షితురాలై అడవి బాట పట్టింది. ఆమె నానమ్మ, తాత చనిపోగా గ్రామస్థులే చందాలు వేసి అంత్యక్రియలు చేశారు. ప్రస్తుతం తనకు చెల్లె మాత్రమే ఉంది. ఇక నంగునూరు మండల కేంద్రానికి చెందిన రంగు అరుణ అలియాస్‌ పద్మక్క 20 ఏళ్లుగా మావోయిస్టుల్లో ఉన్నారు. ఛత్తీస్ ఘడ్‌లోని దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీలో యాక్షన్‌ టీం మెంబర్‌గా ఉన్న పద్మక్కపై రూ.2లక్షల రివార్డు ఉన్నట్లు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. అరుణ తల్లి అనారోగ్యానికి గురై మంచం పట్టింది. తన కూతురు ఎక్కడుందో, ఎలా ఉందో తెలియదని చెబుతోంది. బంధువులకు కూడా ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది.


zzzzzzzzzzzzzzzzzzzzzzzzzz.jpgఆచూకీ ఎలా తెలిసేది..

అక్కన్నపేటకు చెందిన కాశబోయిన స్వరూప, నంగునూరుకు చెందిన రంగు అరుణల ఆచూకీ తెలియరావడం లేదు. పోలీసులు సైతం వీరి గురించి స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం. వీరు అడవిలో ఉన్నారా? ఉంటే ఏ స్థానంలో పనిచేస్తున్నారు? లేక లొంగిపోయారా.. లొంగిపోతే ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు...? లేదంటే వరుసగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్లలో తమ ప్రాణాలు కోల్పోయారా...? ఏ సందర్భంలో అసువులు బాసారా...? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి సమాచారం లేదు. అయితే తమ బిడ్డలు క్షేమంగా ఉన్నారా.. లేదా అనే ఆవేదనతో మాత్రం వీరి కుటుంబాలు ఉన్నాయి.


కేంద్ర కమిటీ దాకా ప్రస్థానం

నాటి పీపుల్స్‌వార్‌ నక్సల్స్‌గా, ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతల్లో చాలామంది ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి తమ ప్రస్థానం ప్రారంభించినవారే. శాఖమూరి అప్పారావు, సోలిపేట కొండాల్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌, దుబాషి శంకర్‌, కాతా రామచంద్రారెడ్డి కేంద్ర, రాష్ట్ర కమిటీలకు ప్రాతినిథ్యం వహిస్తూ నేలకొరిగారు. ఇక జనశక్తి గ్రూపులోనూ డేగల సుభాష్‌, రియాజ్‌, సంగన్న, భీమన్న దళాలూ మెతుకుసీమ పల్లెల్లో హవా సాగించాయి. ఆనాడు గిరాయిపల్లితోపాటు మేదినీపూర్‌, ఏడుపాయల, రామాయంపేట, ఇందుప్రియాల్‌, సీతారాంపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో నక్సల్స్‌ చనిపోయారు. వందల సంఖ్యలో ప్రాతినిథ్యం వహించిన అన్నల్లో ప్రస్తుతం ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. మరో కీలకనేత ధూలిమిట్ట మండలం కూటిగల్‌కు చెందిన కుంకటి వెంకటయ్య సాయుధ పోరాట విరమణలో భాగంగా లొంగిపోయారు. దీంతో పార్టీలో ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన అన్నల ప్రస్థానం ముగిసిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పింఛను పెంపు!

తగ్గిన బంగారం ధరలు! ప్రస్తుతం రేట్స్ ఇవీ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2026 | 01:53 PM