రాయలసీమ ఎత్తిపోతల పథకం.. మండలిలో వైసీపీ, మంత్రుల మధ్య వాగ్వాదం
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:29 PM
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు, మంత్రుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. రాయలసీమ లిఫ్ట్ విషయంలో తప్పంతా వైసీపీదే అని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
అమరావతి, ఫిబ్రవరి 26: మూడోసారి వాయిదా అనంతరం ఏపీ శాసనమండలి తిరిగి మొదలైంది. రాయలసీయ నీటి ప్రాజెక్టులపైనే మండలిలో మరోసారి రచ్చ జరిగింది. గాలేరు నగరి ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయాలపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధించగా మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఈ చర్చలో అధికార, ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. గాలేరు నగరి ప్రాజెక్టుపై వైసీపీ సభ్యులు ప్రశ్న లేవనెత్తారు. వరద నీరు కేవలం 30 రోజులు మాత్రమే వస్తుందని.. జగన్ ప్రభుత్వం 3,825 కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. గాలేరు నగరి ప్రాజెక్టుకు ఎంత బడ్జెట్ కేటాయించారని.. ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇతర ఎత్తిపోతల పథకాలకు ఉన్న తేడా తెలుసుకుని ప్రశ్నలు అడగాలని సూచించారు. ధైర్యంగా వాకౌట్ చేయకుండా సమాధానాలు వినాలన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మరోసారి వివరాలు చెబుతానని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం అందరికీ అవసరమన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. ఈ పథకాన్ని ఎప్పటిలోగా ప్రారంభించి, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా ఆనాటి ప్రభుత్వం ముందుకు వెళ్లిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి స్పందిస్తూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన రోజే మాజీ మంత్రి హరీశ్ రావు కూడా మాట్లాడారని అన్నారు. ‘జగన్‌తో మాట్లాడాం... అంతకుమించి ముందుకు వెళ్ళవద్దని జగన్‌కు చెప్పినట్లు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు’ అని తెలిపారు. తెలంగాణ రాజకీయ ప్రయోజనాల కోసం వారు మాట్లాడారని మంత్రి చెప్పారు.
మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ విషయంలో తప్పంతా వైసీపీదే అని ఆరోపించారు. ప్రాజెక్టును ఆపి తప్పు చేసింది ఎవరో వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. సభా సాక్షిగా రాయలసీమకు జగన్ సర్కారు ఏమీ చేయలేదని వైసీపీ సభ్యులు నిరూపించారని చెప్పారు. ‘జగన్‌తో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్‌పై తామే స్టే తెచ్చామని ఆనాటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్ రావు స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని తెలంగాణ శాసనసభ వేదికగా హరీశ్ రావు తెలిపారు’ అని మంత్రి గుర్తుచేశారు. చేతకాని వైసీపీ దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. ప్రాజెక్టు ఆపితే... చేతకాకుండా కోర్టుకు వెళ్లి అఫిడవిట్ వేస్తే దానికి తాము సమాధానం చెప్పాలా అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
సోమువీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు.. మండలిలో ఉద్రిక్త వాతావరణం
మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ.. గందరగోళం
Read Latest AP News And Telugu News