Share News

మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ.. గందరగోళం

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:02 AM

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పథకం నిలిపివేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. రాయలసీమ అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

మండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ.. గందరగోళం
AP Legislative Council

అమరావతి, ఫిబ్రవరి 26: ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తీవ్ర చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు.. ‘మీరు వేసిన ప్రశ్న ఏమిటి? మీరు మాట్లాడుతున్నది ఏమిటి?’ అని మండిపడ్డారు. రాయలసీమ అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ వాళ్లకు ఎక్కడుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు’ అని మంత్రి తీవ్రంగా విమర్శించారు.


మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ‘ప్రశ్న వేసి రాజకీయాలు చేయడం ఏమిటి?’ అని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలని 2020లో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ‘2020 సెప్టెంబర్‌లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో వైసీపీ సభ్యులకు తెలియదా?. 2023లో రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం మంచినీటి కోసమేనని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. 2020లోనే ఆనాటి ప్రభుత్వం ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేసి చంద్రబాబు నాయుడిపై నెపం వేయడం ఏమిటి?. 2020లోనే పనులు నిలిపివేసిన ఆనాటి సీఎం జగన్‌ను మీరు ఎందుకు నిలదీయడం లేదు?’ అని రామానాయుడు ప్రశ్నించారు.


‘కేవలం గుంతలు తవ్వి రూ.900 కోట్లు నిధులు తీసుకున్నారు. రాయలసీమకు ఎవరు ద్రోహం చేశారో, ఎవరు న్యాయం చేశారో ప్రజలందరికీ తెలుసు. మేము గాలేరు - నగరి ద్వారా నీళ్లు తీసుకొచ్చాం. చివరకు.. పులివెందులకు నీళ్లు ఇచ్చే చిత్రావతి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. తల్లికి కోక పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్టు జగన్ పరిస్థితి ఉంది’ అని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో పరిస్థితి అదుపుతప్పడంతో మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను వాయిదా వేశారు.


కాసేపటికి తిరిగి ప్రారంభమైన సభలోనూ వైసీపీ సభ్యుల ఆందోళనలతో మరోసారి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఉపన్యాసం చేయడం ఏంటని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రశ్నకు సమాధానం చెప్పడం పూర్తి అయిందని ఛైర్మన్ చెప్పడంతో వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ సభ్యులు నిరసనలకు దిగగా.. గందరగోళం నెలకొనడంతో సభను ఛైర్మన్ మళ్లీ వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి...

తెలంగాణలో 45 మంది ఐఏఎస్‌ల బదిలీ

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 26 , 2026 | 11:45 AM