Share News

ఏపీ అసెంబ్లీలో నేడు రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ABN , Publish Date - Feb 26 , 2026 | 08:18 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజుకు చేరుకున్నాయి. నేడు ఉభయ సభల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతోపాటు, వివిధ శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై సుదీర్ఘ చర్చ జరపనుంది.

ఏపీ అసెంబ్లీలో నేడు రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
The Andhra Pradesh Assembly budget session entered its 11th day

అమరావతి, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజుకు చేరుకున్నాయి. నేడు (ఫిబ్రవరి 26, 2026) ఉభయ సభల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, వివిధ శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై సుదీర్ఘ చర్చ జరపనుంది.

నేడు సభలో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు:

1. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు: రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులు, బదలాయింపులపై ఉన్న నిబంధనలను సరళీకృతం చేసే దిశగా ఈ సవరణ ఉండనుంది.

2. గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లు: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సచివాలయ వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరిచేలా మార్పులు చేయనున్నారు.


జలవనరుల శాఖపై ప్రత్యేక చర్చ:

నేటి సమావేశాల్లో జలవనరుల శాఖకు అత్యంత ప్రాధాన్యత లభించనుంది. మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖకు సంబంధించిన బడ్జెట్ పద్దులను ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించనున్నారు.

ఇదే సందర్భంలో, జలవనరుల శాఖకు సంబంధించిన 50వ వార్షిక నివేదికను మంత్రి ఉభయ సభల ముందు ఉంచనున్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఈ నివేదికలో స్పష్టత ఇవ్వనున్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు రానున్న అంశాలు:

నేడు ప్రశ్నోత్తరాల సమయం పలు ప్రజా సమస్యలపై మంత్రుల సమాధానాలతో వాడిగా వేడిగా సాగనుంది. ముఖ్యంగా చర్చకు రానున్న అంశాల విషయానికొస్తే, తిరుమల బాలాజీ నగర్లో అక్కడి గృహాలకు స్లాబుల నిర్మాణంపై ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది.

నియామకాల్లో రిజర్వేషన్లు: ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులు (Sports), ఎన్.సీ.సీ.(NCC) అభ్యర్థులకు ఇచ్చే మినహాయింపులపై మంత్రులు సమాధానం చెప్పనున్నారు.

స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు: కొత్తగా ప్రవేశపెట్టనున్న స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల విధివిధానాలపై చర్చ జరగనుంది.

మౌలిక సదుపాయాలు: పి.గన్నవరం డ్రైనేజీ వ్యవస్థ, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై ప్రశ్నలు రానున్నాయి.

పారిశ్రామిక, సంక్షేమం: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కల్పిస్తున్న అవకాశాలు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం అమలుపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం తర్వాత వివిధ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చించి, సభ ఆమోదం తెలపనుంది.


ఈ వార్తలూ చదవండి

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్ షురూ.. ఇక విదేశీ షేర్లలో నేరుగా పెట్టుబడులు

Updated Date - Feb 26 , 2026 | 08:48 AM