Share News

కల్తీ పాల బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్

ABN , Publish Date - Feb 26 , 2026 | 10:48 AM

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. బాధితులను కాపాడేందుకు 'ఫోబి ఫిజల్' అనే ప్రత్యేక ఔషధాన్ని అత్యవసరంగా తెప్పించింది.

కల్తీ పాల బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్
Rajahmundry adulterated milk case

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. బాధితులను కాపాడేందుకు 'ఫోబి ఫిజల్' అనే ప్రత్యేక ఔషధాన్ని అత్యవసరంగా తెప్పించింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి కందుల దుర్గేష్ నేడు పరామర్శించారు. బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షించారు.

మంత్రి ఏమన్నారంటే..
పరామర్శ అనంతరం మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో 8మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, వీరిలో నలుగురు బాధితులు ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు. వారి పరిస్థితి విషమంగా ఉందని మంత్రి వెల్లడించారు.


ప్రత్యేక ఔషధం..

బాధితులను కాపాడేందుకు 'ఫోబి ఫిజల్' (Fomepizole) అనే అత్యవసర మెడిసిన్‌ను ప్రభుత్వం ప్రత్యేకంగా తెప్పించిందని మంత్రి చెప్పారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు ఆధ్వర్యంలో ఈ ఇంజక్షన్లను బాధితులకు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చికిత్స సత్ఫలితాలను ఇస్తోందని, ఇప్పటికే కొంతమందిలో యూరిన్ అవుట్‌పుట్ ప్రారంభమవ్వడం సానుకూల పరిణామమని మంత్రి చెప్పారు.

కఠిన చర్యలకు ఆదేశం..

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీ రాయుళ్లకు మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 'ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. బాధ్యులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం' అని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం బాధితులందరికీ అండగా ఉంటుందని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


ఈ వార్తలూ చదవండి

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్ షురూ.. ఇక విదేశీ షేర్లలో నేరుగా పెట్టుబడులు

Updated Date - Feb 26 , 2026 | 11:27 AM