ప్రాణదాతలు.. విగతజీవులై..
ABN , Publish Date - Feb 27 , 2026 | 09:57 AM
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చెందిన ఓ యువ వైద్యురాలు ప్రేమలో మోసపోయానని ఆవేదన చెంది, గడ్డి మందు ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
క్షణికావేశంలో వైద్య విద్యార్థినుల బలవన్మరణం
రెండు నెలల్లోనే ఇద్దరి ఆత్మహత్య
ఒత్తిడితో కఠిన నిర్ణయం
కౌన్సెలింగ్ నిర్వహిస్తే మార్పు
సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చెందిన ఓ యువ వైద్యురాలు ప్రేమలో మోసపోయానని ఆవేదన చెంది, గడ్డి మందు ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మరువక ముందే సిద్దిపేట అర్బన్ మండలంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఫిజియోథెరఫి చదువుతున్న విద్యార్థిని ప్రేమ వ్యవహారాల కారణంతో, హాస్టల్ గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రేమ ముసుగులో
ప్రేమ మత్తులో ఇద్దరు విద్యార్థినులు తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. ప్రేమలో మోసపోయానన్న ఆవేదనతో ఒకరు, ప్రేమ వ్యవహారాల చిక్కుల్లో మరొకరు తమ మరణశాసనాన్ని రాసుకున్నారు. మనసులో తలెత్తిన చిన్నపాటి కష్టాన్ని భరించలేక, లోలోపల మదనపడుతూ చావే సమస్యకు పరిష్కారమని భావిస్తున్నారు. ప్రాణాలు పోసే వైద్య విద్యను అభ్యసిస్తూ, తమ ప్రాణాల విలువను గుర్తించలేకపోవడం విషాదకరం. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోకుండా, ఉన్న ఒక్క జీవితాన్ని తృణప్రాయంగా వదిలేస్తున్నారు.
కళాశాలల్లో కౌన్సెలింగ్ కరువు
విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కళాశాల యాజమాన్యాలు విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం చదువుపైనే కాకుండా, విద్యార్థుల వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది. చాలామంది విద్యార్థులు తమ సమస్యలను తల్లిదండ్రులకు గానీ, స్నేహితులకు గానీ చెప్పుకోలేక ఒంటరిగా కుమిలిపోతున్నారు. కళాశాలల్లో ఎప్పటికప్పుడు సైకలాజికల్ కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహిస్తే, విద్యార్థుల్లో ధైర్యాన్నినింపి ఆత్మహత్యలను నివారించే అవకాశం ఉంటుంది.
కుటుంబాలకు తీరని కడుపుకోత
నవమాసాలు మోసి, కనిపెంచిన పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశపడిన తల్లిదండ్రులకు ఆత్మహత్యలు తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. కన్నవారి కళ్లముందే విగతజీవులుగా మారుతుండటంతో ఆ కుటుంబాలు కోలుకోలేకపోతున్నాయి. ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటేనే లక్ష్యాలను చేరుకోగలమని నిపుణులు సూచిస్తున్నారు. బలవన్మరణాల వైపు అడుగులు వేయబోయే ముందు ఒక్కసారి తమను నమ్ముకున్న కుటుంబం గురించి ఆలోచించాలని వైద్యులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హమ్మయ్య! గోల్డ్ రేట్ తగ్గిందిగా!
మూడో డిస్కమ్ ఏర్పాటులో మరో కీలక అడుగు
Read Latest Telangana News and National News