Share News

మూడో డిస్కమ్‌ ఏర్పాటులో మరో కీలక అడుగు

ABN , Publish Date - Feb 27 , 2026 | 05:10 AM

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లతోపాటు ప్రభుత్వ పథకాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయదల్చిన మూడో డిస్కమ్‌ ఏర్పాటులో కీలక అడుగు పడింది....

మూడో డిస్కమ్‌ ఏర్పాటులో మరో కీలక అడుగు

  • సీఎండీగా ముషారఫ్‌ అలీని నియమించిన సర్కార్‌

  • త్వరలోనే లైసెన్‌ కోసం దరఖాస్తు చేసే చాన్స్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లతోపాటు ప్రభుత్వ పథకాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయదల్చిన మూడో డిస్కమ్‌ ఏర్పాటులో కీలక అడుగు పడింది. మూడో డిస్కమ్‌ సీఎండీగా ముషారఫ్‌ అలీ ఫారూఖీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి, అవసరాలకు మధ్య అంతరంతో చితికిపోతున్న దక్షిణ డిస్కమ్‌(టీజీఎస్పీడీసీఎల్‌), ఉత్తర డిస్కమ్‌(టీజీఎన్పీడీసీఎల్‌)ల పరపతి పెంచడానికి రానున్న ఆర్థిక సంవత్సరంలో (2026 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి) కొత్త డిస్కమ్‌ను మనుగడలోకి తేవాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి ‘తెలంగాణ కిసాన్‌ ఉర్జా డిస్కమ్‌’గా నామకరణం చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈఆర్‌సీకి దరఖాస్తు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త డిస్కమ్‌కు లైసెన్స్‌ వచ్చాక కనెక్షన్లు, పీపీఏలు, బకాయిలతోపాటు ఉద్యోగులు బదిలీ కానున్నారు. ఈ మేరకు 29,05,779 వ్యవసాయ పంపుసెట్లు, 489 ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు, 99 వాటర్‌బోర్డు, 1132 మిషన్‌ భగీరథల కనెక్షన్లు కొత్త డిస్కమ్‌ పరిధిలోకి వెళ్లనున్నాయి. పాత డిస్కమ్‌ల నెట్‌వర్క్‌తోనే కొత్త డిస్కమ్‌ పని చేయనుంది. మొత్తంగా రూ.4,929 కోట్ల ఆస్తులు కొత్త డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి. ఐదేళ్ల కాలానికి వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాలు, వాటర్‌బోర్డు, మిషన్‌ భగీరథ కనెక్షన్లు ఏ మేరకు విద్యుత్‌ను వినియోగించాయో ఆ నిష్పత్తి ఆధారంగా కొత్త డిస్కమ్‌కు పీపీఏ(విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు)లను బదలాయించనున్నారు. మొత్తం విద్యుత్‌ వినియోగంలో 42శాతం వాటాను కొత్త డిస్కమ్‌ కలిగి ఉండనుంది. అలాగే, ఎత్తిపోతల పథకాల నుంచి రూ.22,926కోట్లు, వాటర్‌బోర్డు (హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ సీవరేజీ బోర్డు) నుంచి రూ.7084 కోట్లు, మిషన్‌ భగీరథ నుంచి రూ.5972 కోట్ల మేర బకాయిలు కొత్త డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి. 2025 జూలై 31వ తేదీ నాటికీ వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణరూపంలో తెలంగాణ డిస్కమ్‌లు రూ.55,979 కోట్లు తీసుకోగా, అందులో రూ.9,032 కోట్లను కొత్త డిస్కమ్‌కు బదలాయించనున్నారు.

Updated Date - Feb 27 , 2026 | 05:10 AM