ఏపీలోని యూనివర్సిటీలన్నింటినీ భ్రష్టు పట్టించారు.. వైసీపీపై మంత్రి లోకేశ్ ఫైర్
ABN , Publish Date - Feb 27 , 2026 | 09:26 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రా విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో రోజువారీ వేతనాలు, ఎన్ఎంఆర్ ఉద్యోగుల వేతనాలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.
అమరావతి, ఫిబ్రవరి 27: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) 12వ రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాలతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో రోజువారీ వేతనాలు, ఎన్ఎంఆర్ ఉద్యోగుల వేతనాలపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రశ్నలేవనెత్తారు. వైసీపీ హయాంలో ఉద్యోగుల కేటగిరి మారుస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు. చిన్న స్థాయి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సభలో కోరారు. మరో ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో ఆంధ్రా యూనివర్సిటీని అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారని, యూనివర్సిటీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
దీనిపై మంత్రి లోకేశ్ సమాధానం ఇస్తూ.. వైసీపీ హయాంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం దేశ స్థాయి ర్యాంకింగ్స్‌లో 72వ స్థానానికి పడిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టాప్ 10 స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. యూనివర్సిటీ వందేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నింటినీ భ్రష్టు పట్టించారని మంత్రి ఆరోపించారు. యూనివర్సిటీలలో అన్ని రకాల ఉద్యోగులపై ఆడిట్ జరుగుతోందని లోకేశ్ వెల్లడించారు. ఆడిట్ పూర్తి చేసిన తర్వాత పదోన్నతులు, నియామకాలు, పర్మినెంట్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ విచారణ ముమ్మరం చేస్తామని మంత్రి లోకేశ్ తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
పూర్తి నివేదిక మా ముందు ఎందుకు ఉంచలేదు?
Read Latest AP News And Telugu News