ప్రతి ఎకరాకూ సాగునీరు
ABN , Publish Date - Feb 27 , 2026 | 02:55 AM
తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలన్న సంకల్పాన్ని నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు త్వరలో బ్లూప్రింట్
నల్లమల సాగర్‌తో 2 రాష్ట్రాలకు ప్రయోజనం
దీనికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు
కాళేశ్వరం ప్రాజెక్టుకు మేమెప్పుడూ అడ్డుచెప్పలేదు
4 నెలల్లో వెలిగొండ తొలి దశ పూర్తిచేసి నీళ్లిస్తాం
గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలి దశ పూర్తి
ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులూ ఈ టర్మ్‌లోనే పూర్తిచేస్తాం
గంగా, కావేరి నదుల అనుసంధానం నా ప్రగాఢ ఆకాంక్ష
అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో సీఎం చంద్రబాబు
గంగా, కావేరి నదుల అనుసంధానం జరగాలన్నదే నా ప్రగాఢ ఆకాంక్ష. ఈ భూమినే ఒక జలాశయంగా మార్చాల్సిన అవసరం ఉంది. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో నా అభ్యర్థనపై కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు అధ్యక్షతన నదీ జలాల అనుసంధానంపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
- సీఎం చంద్రబాబు
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మే 15 నాటికే నారుమళ్లకు సాగునీరందిస్తాం. ఈ మేరకు రైతులను సన్నద్ధం చేయాలి.
సాగునీటి రంగానికి 2014-19 మధ్యకాలంలో రూ.68వేల కోట్లు వ్యయం చేశాం. గత 20 నెలల్లోనే రూ.20వేల కోట్లు ఖర్చు చేశాం.
- సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలన్న సంకల్పాన్ని నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నిర్దిష్ట సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు త్వరలోనే బ్లూప్రింట్ సిద్ధం చేసి అమ లు చేస్తామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై గురువారం అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు.
‘తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే పోలవరం- నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుకు తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. గోదావరి నదిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే మేం అభ్యంతరం చెప్పలేదు. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలు వాడుకుంటే ఎవరికి నష్టం? టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. కాంగ్రెస్, వైసీపీ అధికారంలో ఉండగా సీమలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులన్నీ విధ్వంసానికి గురయ్యాయి’ అని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో నాలుగు నెలల్లో వెలిగొండ తొలిదశ పూర్తిచేసి నీళ్లిస్తామని ప్రకటించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలిదశ పూర్తిచేస్తామని, ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులనూ ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతానికీ నీరందించేలా చర్యలు చేపడతామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
నీటి భద్రతపైనే దృష్టి
‘విజన్-2047లో భాగంగా నీటి భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. నదీ జలాలను అత్యంత పవిత్రమైనవిగా భావించి పూజించే సంప్రదాయం మనది. గోదావరికి అఖండ హారతి, కృష్ణానదికి పవిత్రహారతి ఇచ్చాం. గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించే అపూర్వ అవకాశం మా ప్రభుత్వానికి వచ్చింది. గత 30ఏళ్లుగా గోదావరి నది నుంచి సగటున 3వేల టీఎంసీల జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోతున్నాయి. అందుకే వంశధార నుంచి పెన్నా వరకూ నదుల అనుసంధానం చేపట్టాలని నిర్ణయించాం. రాష్ట్రంలో అంతర్గతంగా నదుల అనుసంధానం చేపడితే జాతీయ స్థాయిలో ఈ ప్రక్రియ సులువవుతుందన్న ప్రధాని మోదీ సూచనలు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ టీడీపీ, ఎన్డీయే ప్రభుత్వాల హయాంలోనే నిర్మించినవే. ప్రధానంగా రాయలసీమలో హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులను ఎన్టీఆర్, తెలుగుదేశం ప్రభుత్వాల పాలనలోనే చేపట్టాం. హంద్రీ నీవా కాలువను 738 కి.మీ. మేర విస్తరించి కుప్పంలో పరమసముద్రం చెరువు దాకా కృష్ణా జలాలను తీసుకెళ్లాం. మడకశిర వరకూ నీటిని తీసుకువెళ్లి ఆ ప్రాంతవాసుల దాహార్తిని తీర్చాం. ధవళేశ్వరం వద్ద బ్యారేజీ కట్టిన కాటన్ దొరను గోదావరి జిల్లాల రైతాంగం ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996 మార్చి 5న నేనే శంకుస్థాపన చేశా. దాదాపు 30ఏళ్ల తర్వాత మరో నాలుగు నెలల్లో నేనే ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నా. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.2,500 కోట్లు వ్యయం చేస్తాం. రూ.456 కోట్లతో ఫీడర్ చానల్ పనులకు బుధవారమే శంకుస్థాపన చేశాం. ఈ ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే 2024 ఎన్నికల ముందు జగన్ సిగ్గులేకుండా రిబ్బన్ కట్ చేశారు. కుప్పంలోనూ ట్యాంకర్లు తీసుకువచ్చి కాలువలో నీళ్లు పోశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులనూ జగన్ విధ్వంసానికి గురిచేశారు. గత పాలకులు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు గేట్లు కూడా పెట్టలేకపోయారు. వారి నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు పోలవరం డయాఫ్రమ్‌వాల్ కొట్టుకుపోయినా జగన్ గుర్తించలేకపోయారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆపేశారు. జగన్ ప్రాజెక్టులను విధ్వంసం చేస్తుంటే నేను అనంతపురం నుంచి వంశధార దాకా పర్యటించా. చేయని నేరానికి గత పాలకులు నన్ను అరెస్టు చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టారు.’
ప్రాజెక్టుల్లో పుష్కలంగా జలాలు
‘రాష్ట్రంలోని చిన్నా, పెద్దా రిజర్వాయర్లలో 1,312 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 793 టీఎంసీల మేర జలాశయాల్లో నిల్వలున్నాయి. రాష్ట్రంలో 16లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ అమలు చేస్తున్నాం. ఇందులో 3లక్షల హెక్టార్లలో మొక్కజొన్న పంట వేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో నీటి పొదుపు సంరక్షణ విధానాన్ని అమలు చేయయడం ద్వారా విద్యుత్తుఆదా చేస్తున్నాం ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తే నెలకు రూ.300 కోట్ల మేర విద్యుత్తు బిల్లులు ఆదా అవుతాయి. కొందరు రాజకీయం కోసమే నీటి సమస్యలను తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ సాగునీరు, ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా తాగునీరు, పరిశ్రమలకు నీరందించే సంకల్పంతో పనిచేస్తున్నాం.’
తాగునీరు కలుషితమైతే కమిషనర్లదే బాధ్యత
మున్సిపల్ శాఖ ఉత్తర్వులు
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషితమైతే కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఇటీవల గ్యాస్ట్రోఎంటరైటీస్, డయేరియా కేసులు చెలరేగిన నేపథ్యంలో సీఎం ఆదేశాలతో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పబ్లిక్‌హెల్త్, ఆరోగ్యశాఖ, జిల్లా యంత్రాంగం పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు పెంచి లోపాలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి మున్సిపల్ కమిషనర్ పట్టణంలో సరఫరా చేసే తాగునీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని, దీనికి వ్యక్తిగత బాధ్యత వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.