అవినాశ్ అరెస్ట్
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:14 AM
మద్యం కుంభకోణంలో ఏ7గా ఉన్న ముప్పిడి అవినాశ్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గురువారం సిట్ అధికారుల ఎదుట ఆయన లొంగిపోయాడు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లొంగుబాటు
విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చిన సిట్
నేటి వరకు రిమాండ్.. గుంటూరు జైలుకు తరలింపు
విజయవాడ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ఏ7గా ఉన్న ముప్పిడి అవినాశ్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గురువారం సిట్ అధికారుల ఎదుట ఆయన లొంగిపోయాడు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు శుక్రవారం వరకు అవినాశ్‌రెడ్డికి రిమాండ్ విధించింది. ప్రాసిక్యూషన్ తరఫున డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి వాదనలు వినిపించారు. అవినాశ్ రెడ్డి మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి తోడల్లుడని తెలిపారు. ఆయన ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్నాడని, అందువల్ల అవినాశ్‌రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. తోడల్లుళ్లు ఇద్దరూ ఒకే జైలులో ఉంటే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో అవినాశ్‌రెడ్డి ఒక్క సంతకంతో వేలాది లావాదేవీలు నిర్వహించాడన్నారు. నేరం చేయడంలో తోడల్లుడు రాజశేఖర్‌రెడ్డి కంటే ఆయన తక్కువ కాదని, సమానంగా నేరం చేశాడని కోర్టుకు వివరించారు. అవినాశ్‌రెడ్డి చేసిన కుంభకోణానికి సంబంధించి 39 మంది నుంచి సిట్ అధికారులు వాంగ్మూలం తీసుకున్నారన్నారు. నిందితుడు తరఫున న్యాయవాది చంద్రగిరి విష్ణువర్ధన్ వాదనలు వినిపిస్తూ.. డీడీ చేసిన వాదనలను రిమాండ్ రిపోర్టులో ఎక్కడా రాయలేదన్నారు. నిందితుడి కాలికి గాయమైనందున విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని అభ్యర్థించారు. రిమాండ్ పొడిగింపునకు రాజమండ్రి నుంచి ఇక్కడ తీసుకురావడం కష్టంగా ఉంటుందన్నారు.
రిమాండ్ పొడిగింపు బాధ్యతను పోలీసులు చూసుకుంటారని, నిందితుడిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత అవినాశ్‌రెడ్డికి శుక్రవారం వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశాలు ఇచ్చారు. నిందితుడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఎస్కార్ట్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కేసులో ఇతర నిందితుల రిమాండ్ పొడిగింపు శుక్రవారం వరకు ఉంది. నిందితులందరి రిమాండ్ పొడిగింపు ఒకే తేదీ ఉండేలా అవినాశ్ రెడ్డికి ఒక రోజు రిమాండ్ విధించారు.