విశాఖకు క్యాప్‌జెమినీ!
ABN , Publish Date - Feb 27 , 2026 | 02:21 AM
ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ విశాఖ నుంచి కార్యకలాపాల నిర్వహణకు ఆసక్తి చూపుతోంది.
భూముల పరిశీలనకు వచ్చిన కంపెనీ ప్రతినిధులు
మధురవాడ ఐటీ పార్కు సహా 4 ప్రాంతాల సందర్శన
విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ విశాఖ నుంచి కార్యకలాపాల నిర్వహణకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఇప్పటికే కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. భూముల పరిశీలనకు గురువారం నగరానికి వచ్చారు. భీమిలి ఆర్డీవో సంగీత్‌మాధుర్, విశాఖ రూరల్ తహశీల్దారు పాల్‌కిరణ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రతినిధులు, ఏపీఐఐసీ అధికారులతో కలిసి తొలుత మధురవాడ ఐటీ పార్కులోని హిల్-1పై మిరాకిల్ సొల్యూషన్స్‌కు సమీపానున్న 20 ఎకరాలను చూశారు. అనంతరం అడవివరంలో గూగుల్ డేటా సెంటర్ నిమిత్తం కేటాయించిన భూమికి ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంకా విశాఖ రూరల్, ఆనందపురం మండలాల్లో మరో రెండు ప్రాంతాలను చూశారు. కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ఉన్న భూములపై తమ అభిప్రాయాన్ని ప్రభుత్వ పెద్దలకు నివేదించనున్నారు.