Share News

100 పబ్లిక్‌ స్కూళ్లు

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:30 AM

రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఈ ఏడాదే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 100 నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు.

100 పబ్లిక్‌ స్కూళ్లు

  • రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో.. ఈ ఏడాదే ప్రారంభించాలి

  • ‘క్యూర్‌’లో సకల సౌకర్యాలతో సర్కారీ బడులు.. ఏడాదిలో పూర్తి కావాలి

  • ఏఐపై టీచర్లు, లెక్చరర్లకు స్వల్పకాలిక శిక్షణ.. విద్యాశాఖ సమీక్షలో సీఎం

  • త్వరలో హార్వర్డ్‌ వర్సిటీతో ఎంసీహెచ్‌ఆర్‌డీ ఒప్పందం

  • గిట్టనివారు న్యాయస్థానాలకు వెళ్లి గ్రూప్‌-1ను ఆపాలనుకున్నారు

  • ప్రభుత్వ అధికారులు విలువలు, బాధ్యతలు విస్మరించొద్దు

  • నేనే మీకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ పదోన్నతుల పత్రాలిస్తా

  • గ్రూప్‌-1, 2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఈ ఏడాదే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 100 నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ తరహాలోనే ఈ 100 పాఠశాలలూ ఉండాలని సీఎం ఆదేశించారు. గురువారమిక్కడి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆయన విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రూప్‌ 1, 2 నూతన అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను నాణ్యమైన విద్యకు చిరునామాగా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు ఎంత వ్యయమైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(క్యూర్‌) పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ తరహాలో నిర్మించాలని ఇంజనీర్లను ఆదేశించారు. క్యూర్‌ పరిధిలో నిర్దేశించుకున్న 12 సమీకృత పాఠశాలల నిర్మాణం ఏడాదిలో పూర్తి కావాలన్నారు. భారతీయ విద్యా భవన్‌, జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ వంటి బడుల్లో ఉండే అన్ని వసతులూ ఈ సమీకృత పాఠశాలల్లో ఉండాలని స్పష్టం చేశారు. క్యూర్‌లో అప్‌గ్రేడ్‌ చేయనున్న 17 స్కూళ్లు; అదనపు తరగతులు, ఇతర వసతులు కల్పించనున్న 164 పాఠశాలల పనుల్లో రాజీ పడొద్దని సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 99 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాలకు కేటాయించాలని సీఎం సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు.. పాఠశాలలు, కళాశాలలను సందర్శించి వసతుల కల్పన, ఇతర అంశాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి చెప్పారు. కృత్రిమ మేధ ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే దాని బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, అధ్యాపకులకు స్వల్పకాలిక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఏఐతో ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పులు తెలుసుకుని, మన విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకునేలా సన్నద్ధత ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.


పాఠశాలల్లో అల్పాహారం అందించాలి..

2026-27 విద్యా సంవత్సరం నుంచే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం(బ్రేక్‌ఫాస్ట్‌) అందించాలని రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయమై అధికారులు, హరేకృష్ణ మిషన్‌ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. అల్పాహారంతో పాటు ప్రతి విద్యార్థికీ పాలు అందజేయాలని, వాటిని విజయ డెయిరీ నుంచి సేకరించాలని చెప్పారు. విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి కిట్‌ అందజేయాలని.. అందులో స్కూల్‌ బ్యాగ్‌, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలని సీఎం తెలిపారు. పాలిటెక్నిక్‌ కాలేజీలు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. కాలం చెల్లిన కోర్సులను తొలగించాలన్నారు. పాలిటెక్నిక్‌, ఏటీసీ కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకూ నిధులు కేటాయిస్తామని సీఎం తెలిపారు. ఇప్పటికే ఉస్మానియా వర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మిగతా వర్సిటీలకు ఎన్ని నిధులు కావాలనేదానిపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డిని ఆదేశించారు.


విలువలు, బాధ్యతలు మరవొద్దు

అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ బృందంతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ త్వరలో ఎంవోయూ చేసుకోనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హార్వర్డ్‌ నుంచి ప్రొఫెసర్లు హైదరాబాద్‌ వచ్చి ఎంసీహెచ్‌ఆర్‌డీలో శిక్షణ ఇస్తారని చెప్పారు. గ్రూప్‌-1, 2 నూతన అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. మీరంతా మొన్న విద్యార్థులు, నిన్న నిరుద్యోగులు, నేడు తెలంగాణ ప్రభుత్వ అధికారులని చెప్పారు. ప్రజాపాలనను 4 కోట్ల మంది ప్రజలకు అందించడానికి శిక్షణ పూర్తి చేసుకుని, ప్రజా సేవకు సంసిద్ధులయ్యారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ.. ఆధిపత్యాన్ని సహించరని సీఎం గుర్తుచేశారు. అలాంటి గడ్డపై పుట్టి పెరిగి.. నేడు గ్రూప్‌-1, 2 అధికారులుగా మారారంటూ నూతన అధికారులను అభినందించారు. ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల స్ఫూర్తి గుర్తు పెట్టుకొని బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, గ్రూప్‌ పరీక్షలపై అవగాహన ఉన్న వాళ్లను చైర్మన్‌గా, సభ్యులుగా నియమించామని చెప్పారు. గతంలో మాదిరిగా ప్రశ్నపత్రాలు జిరాక్స్‌ సెంటర్లలో అమ్మే అవకాశం లేకుండా చేశామన్నారు. తమ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చిందని చెప్పారు. కానీ, గ్రూప్‌-1కు ఎంపికైన అభ్యర్థులకు ఆ ఆనందం 24 గంటలు కూడా ఉంచకుండా, కోట్లు పెట్టి ఉద్యోగాలు కొన్నారని ఆరోపిస్తూ.. గిట్టని వాళ్లు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. అయినా తమ ప్రభుత్వం గ్రూప్‌-1 అభ్యర్థులకు అండగా ఉండి, సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడిందన్నారు. ‘‘పేదరికమంటే ఏంటో తెలిసిన మీరు.. అధికారులయ్యాక విలువలను, బాధ్యతలను మరిచి మనిషిగా పతనం కావద్దు. ఆఫీసుకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరు, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన, నిజాయితీ గల ఎస్‌.శంకర్‌ను తలుచుకోవాలి. మీ సహాయం కోరుతూ పేదవాళ్లు వస్తుంటారు. ఆ సమయంలో మీ తల్లిదండ్రులను తలుచుకోవాలి. ఆ పేదవారికి సంక్షేమ పథకాలను చేరవేసే బాధ్యత మీదే’’ అని సీఎం పేర్కొన్నారు. తల్లిదండ్రులను విస్మరించే ప్రభుత్వ అధికారుల జీతంలో 10-15 ు కోత విధించేలా రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో చట్టం చేయబోతున్నామని రేవంత్‌ తెలిపారు. నేడు గ్రూప్‌-1 కేడర్‌లో కొలువుల్లో చేరుతున్న వారు ఎనిమిదేళ్లు నిబద్ధతతో పని చేస్తే ఐఏఎస్‌, ఐపీఎస్‌ ర్యాంకులను అందుకునే అవకాశాలున్నాయని చెప్పారు. ఆ రోజు కూడా తానే సీఎంగా ఉండి పదోన్నతి పత్రాలను అందిస్తానని తెలిపారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన అధికారులకు పతకాలను అందజేశారు.

Updated Date - Feb 27 , 2026 | 04:30 AM