Share News

385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారుల ఆరా.. శాటిలైట్‌ మ్యాప్‌లతో పరిశీలన

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:58 PM

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూములపై రెవెన్యూ శాఖ కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి ఉన్నతాధికారులు మర్కుక్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి రికార్డుల తనిఖీలు చేపట్టారు.

385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారుల ఆరా.. శాటిలైట్‌ మ్యాప్‌లతో పరిశీలన
Erravelli Farmhouse Land Probe

సిద్దిపేట, సెప్టెంబర్ 17 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి, వెంకటాపూర్‌ పరిధిలోని భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూములపై రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేడు(గురువారం) మర్కుక్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు ముమ్మరంగా దస్త్రాల తనిఖీలు చేపట్టారు.


ఇందుకోసం జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఏడీ సుదర్శన్‌, ఆర్డీఓ చంద్రకళ తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని రికార్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఎర్రవల్లి, వెంకటాపూర్‌ గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లను ఆరా తీసి.. అక్కడి ప్రభుత్వ, పట్టా భూముల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా సుమారు 385 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశంపై అధికారులు తీవ్రంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.


కాగా.. ఈ విచారణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు అధికారులు. గూగుల్‌ ఎర్త్‌ మ్యాప్‌ సాయంతో పాత శాటిలైట్‌ చిత్రాలను పరిశీలిస్తూ.. గతంలో ఆ భూముల పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకుంటున్నారు. నాటికి, నేటికి ఏవైనా మార్పులు జరిగాయా అనే కోణంలో లోతుగా విశ్లేషిస్తున్నారు. అధికారుల విచారణ పూర్తవగానే ఈ భూములకు సంబంధించి మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.


ఇవీ చదవండి:

ఎన్నికల అఫిడవిట్‌తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా!: మంత్రి పొంగులేటి

గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసు.. సిట్‌ ఎదుట ఏ4 సురేశ్ లొంగుబాటు

Updated Date - Sep 17 , 2026 | 05:09 PM