దెబ్బకు హడలిపోయిన అధికారి..! ఇలాకూడా నిరసన వ్యక్తం చేస్తారా!
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:43 PM
అదో ప్రభుత్వ కార్యాలయం.. ఆయనో ప్రధాన అధికారి.. ఆ అధికారి ముందు కొందరు నాయకులు కూర్చొన్నారు. ప్రజా సమస్యలను సదరు అధికారికి వివరిస్తున్నారు. చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతలో సడెన్‌గా ఓ వ్యక్తి లేచి..
నాసిక్: అదో ప్రభుత్వ కార్యాలయం.. ఆయనో ప్రధాన అధికారి.. ఆ అధికారి ముందు కొందరు నాయకులు కూర్చొన్నారు. ప్రజా సమస్యలను సదరు అధికారికి వివరిస్తున్నారు. చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతలో సడెన్‌గా ఓ వ్యక్తి లేచి తన వెంట తీసుకువచ్చిన ఓ సంచిని తీసి అధికారి ముందు టేబుల్‌పై పెట్టాడు. ఆ సంచిలోంచి ఓ కుక్క పిల్లను బయటకు తీసి అధికారి ముందు వదిలిపెట్టాడు. అది చూసిన అధికారి ఒక్కసారిగా హతాశుడయ్యాడు. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే.. సెకన్ల వ్యవధిలోనే మరో సంచిలోంచి మరో కుక్క పిల్లను తీసి టేబుల్‌పై పెట్టాడు. దీంతో బెదిరిపోయిన అధికారి వెంటనే తన కుర్చీలోంచి లేచి వెనక్కి జరిగాడు. ఈ ఘటన నాసిక్ పరిధిలోని నిఫాడ్ నగర పంచాయత్ ఆఫీసులో చోటు చేసుకుంది. మరి ఆ కుక్క పిల్లలను అధికారి ముందు ఎందుకు వదిలిపెట్టారు? అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం..
శివసేన(యూబీటీ)పార్టీ యువసేన విభాగం నాసిక్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రాంధవే నేతృత్వంలోని బృందం నిఫాడ్ నగర్ పంచాయత్ ప్రధాన అధికారి ధీరజ్ భమ్రే వద్దకు వచ్చారు. వీధి కుక్కల బెడద గురించి అధికారికి వివరించారు. ఇప్పటికే అనేకసార్లు కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదంటూ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమ వెంట బస్తాలలో తీసుకువచ్చిన కుక్క పిల్లలను ఒక్కొక్కటిగా అధికారి టేబుల్ పై విడిచి పెట్టారు. అది చూసి పంచాయత్ అధికారి ధీరజ్ భమ్రే షాక్ అయ్యారు. ఆ కాసేపటికే కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండను భ్రమే మెడలో వేయబోయారు శివసేన పార్టీ నాయకుడు విక్రమ్. వెంటనే అలర్ట్ అయిన కార్యాలయ సిబ్బంది.. విక్రమ్‌ను అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, యువసేన నేతల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు యువసేన కార్యకర్తలను పంచాయత్ కార్యాలయం నుంచి బయటకు పంపించారు.
అసలేం జరిగింది..
నిఫాడ్ నగర పంచాయత్ పరిధిలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలపై వీధి కుక్కల వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ఇదే విషయంపై ధీరజ్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు విక్రమ్ పేర్కొన్నారు. ‘గత ఆరు నెలల్లో వీధి కుక్కల సమస్య గురించి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాను. ప్రతి వీధిలో కుక్కల బెడద పెరిగిపోయింది. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోమని ధీరజ్ భమ్రేకు అనేకసార్లు విజ్ఞప్తి చేశాను. తాజాగా ఓ చిన్నారిని వీధి కుక్కలు కరిశాయి. చాలామంది ప్రజలపై కుక్కలు దాడి చేస్తున్నాయి. ఈ సమస్య తీవ్రతను తెలియజేసేందుకు ఫొటోలు కూడా పంపాను. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారి తీరుకు నిరసనగా నేనే వెళ్లి ఆయన బల్లపై నాలుగు కుక్కలను వదిలాను’ అని విక్రమ్ రాంధవే పేర్కొన్నారు. ధీరజ్ భ్రమే టెండర్ పనులపై దృష్టి పెట్టారని.. అందుకే సేన కార్యకర్తలు నోట్ల దండలను తీసుకువచ్చి ఆయన బల్లపై ఉంచారని రాంధవే చెప్పారు. ఇదే చివరి హెచ్చరిక అని.. వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించకపోతే.. భమ్రే ఆఫీసులో మరిన్ని కుక్కలను వదులుతానంటూ రాంధవే వార్నింగ్ ఇచ్చారు.
వీడియో ఇక్కడ చూడండి..