Share News

బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్లు

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:56 AM

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా బతికి ఉన్నవారికీ డెత్‌ సర్టిఫికెట్లు జారీ కావడం తీవ్ర కలకలం రేపింది.

బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్లు

  • ఆరు నెలల్లో 22 మరణ ధ్రువీకరణ పత్రాల జారీ

  • ఇంటర్నెట్‌ సెంటర్‌లో జీపీ డిజిటల్‌ కీ దుర్వినియోగం

  • సొంత వాళ్ల పేరిట సర్టిఫికెట్లు?

  • కార్యదర్శితో పాటు మరొకరిపై కేసు

చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా బతికి ఉన్నవారికీ డెత్‌ సర్టిఫికెట్లు జారీ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మధుతో పాటు అదే గ్రామానికి చెందిన శవల్ల రమేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నకిలీ తంత్రాన్ని ముందస్తుగా గుర్తించినప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ఉదాసీనంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


పంచాయతీ కార్యదర్శి మధు.. ఏకంగా గ్రామపంచాయతీకి చెందిన ఈ-సైన్‌ డిజిటల్‌ టోకెన్‌ (డొంగల్‌ కీ)ను దుర్వినియోగం చేశారు. హైదరాబాద్‌లో ఇంటర్నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న రాంపూర్‌ గ్రామానికి చెందిన శవల్ల రమేశ్‌కు ఈటోకెన్‌ను అప్పగించగా, సుమారు ఆరు నెలల కాలంలో ఏకంగా 22 నకిలీ డెత్‌ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసమో, భూ సంబంధిత విషయాల కోసమో శవల్ల రమేశ్‌ తన కుటుంబ సభ్యులతో పాటు మరికొందరి పేరిట నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు.


mdk1.2.jpgపంచాయతీ కార్యదర్శి వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది. రెండు నెలలుగా ఆయనను ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహింపజేస్తున్నప్పటికీ ఈ నకిలీ బాగోతంపై విచారణ జరపకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.


ఈ విషయం చివరికి జిల్లా కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో వెంటనే సస్పెన్షన్‌ చేస్తూ విచారణకు ఆదేశించారు. ఇదే క్రమంలో పంచాయతీ కార్యదర్శితో పాటు శవల్ల రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీవో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులతో పాటు ఉన్నతాధికారులు చేపడుతున్న విచారణలో మరెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

మా చావుకు కోడలు కారణం కాదు

తగ్గిన పత్తి వ్యాపారం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 11:56 AM