సాగిన చర్మం బిగుతుగా
ABN , Publish Date - Nov 10 , 2026 | 02:42 AM
భారీగా బరువు కోల్పోనప్పుడు ఛాతీ, నడుము, కడుపు.. ఇలా శరీరంలో కొన్ని ప్రదేశాల్లో చర్మం సాగిపోయి, వేలాడుతూ ఉండిపోతుంది. ఇలా సాగిపోయిన...
బాడీ కాంటూరింగ్
భారీగా బరువు కోల్పోనప్పుడు ఛాతీ, నడుము, కడుపు.. ఇలా శరీరంలో కొన్ని ప్రదేశాల్లో చర్మం సాగిపోయి, వేలాడుతూ ఉండిపోతుంది. ఇలా సాగిపోయిన అదనపు చర్మాన్ని తొలగించుకుని, పూర్వపు రూపాన్ని పొందే వీలున్న చికిత్సలున్నాయి. ఆ చికిత్సలు, వాటి ఫలితాలు, జాగ్రత్తల గురించిన వివరాలు....
బరువు తగ్గినప్పుడు ఒంట్లో కొవ్వు కరిగిపోతుంది. అదే సమయంలో పెరిగిన బరువుతో సాగిన చర్మం, బిగువు కోల్పోయి, వేలాడడం మొదలుపెడుతుంది. ఇలా సాగిపోయి వేలాడే చర్మపు సంచులను సరిదిద్దే ప్రక్రియలను వైద్య పరిభాషలో ‘బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్స్’ అని అంటారు.
రొమ్ముల బిగువు పెంచే ‘బ్రెస్ట్ లిఫ్ట్’
కొవ్వు కరగడంతో రూపం కోల్పోవడంతో పాటు, గత బరువు వల్ల కిందకు జారిన రొమ్ములకు ఒకటికి మించిన ప్రక్రియలు అవసరమవుతాయి. జారిన రొమ్ములను పైకి లిఫ్ట్ చేసి, అదనపు చర్మాన్ని తొలగించి, బిగువు పెంచి, గుండ్రని ఆకారాన్ని అందించడం కోసం వైద్యులు బ్రెస్ట్ లిఫ్ట్ ప్రొసిజర్‌ను ఎంచుకుంటారు. గాలి తీసిన బెలూన్‌లా రూపం కోల్పోయిన రొమ్ములకు చక్కని రూపాన్ని అందించడం కోసం, ఫ్యాట్ గ్రాఫ్టింగ్, లేదా ఇంప్లాంట్లను ఆశ్రయిస్తారు. బరువులో భారీ వ్యత్యాసాలు రాకుండా ఉన్నంత కాలం సరిదిద్దిన రొమ్ముల రూపం చెక్కుచెదరకుండా ఉంటుంది. అయితే సర్జరీ తదనంతరం ఒబేసిటీ, గర్భధారణ, పైబడే వయసుతో మళ్లీ రొమ్ముల రూపం మారిపోవచ్చు. అలాగే రొమ్ములకు దన్నునిచ్చే సపోర్టివ్ బ్రాసరీస్ వాడుకోవడం మంచిది.
పొట్టను చదును చేసే ‘టమ్మీ టక్’
పొట్ట దగ్గర వదులైన చర్మంతో పాటు బిగుతు కోల్పోయి, కిందకు జారిన కండరాలను సరిచేసి, పొట్టకు చక్కని రూపాన్నిచ్చే సర్జరీ ఇది. ఒకటికి మించిన ప్రెగ్నెన్సీల వల్ల లేదా ఒబేసిటీ, భారీగా బరువు తగ్గడం వల్ల పొట్ట భాగంలోని ‘రెక్టస్ కండరాలు’ బిగువు కోల్పోయి పక్కకు జరుగుతాయి. దాంతో నిలబడినప్పుడు పొట్ట బయటకు పొడుచుకొస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ‘టమ్మీ టక్’లో భాగంగా కండరాల బిగుతు పెంచి, పొట్టను చదునుగా మార్చవచ్చు. అలాగే పొట్టలోని కొన్ని ప్రదేశాల్లో మొండి కొవ్వు ఏర్పడుతూ ఉంటుంది. టమ్మీ టక్‌తో పాటు ఈ కొవ్వును కూడా తొలగించాల్సి ఉంటుంది. కాబట్టి వైద్యులు ‘లైపో అబ్డామినోప్లాస్టీ’ అనే కొత్త ప్రక్రియలో భాగంగా ఒకే సర్జరీలో కండరాలు, చర్మం, కొవ్వుల సమస్యను ఒకే సమయంలో సరిదిద్దగలుగుతున్నారు.
నాజూకు నడుము కోసం ‘బెల్ట్ లైపెక్టమీ’
టమ్మీ టక్‌లో పొట్ట ముందు భాగం చదునుగా మారితే, బెల్ట్ లైపెక్టమీలో పొట్ట వెనక, పక్క భాగాలు కూడా చక్కని ఆకృతిని సంతరించుకుంటాయి. ఈ సర్జరీలో కూడా లైపోసక్షన్ ద్వారా అదనపు కొవ్వును తొలగించి, తర్వాత చర్మాన్ని కత్తిరించి, తీసేసి, ఆ భాగాన్ని చక్కని ఆకృతిలోకి మలుస్తారు.
నాజూకు చేతుల కోసం ‘ఆర్మ్ లిఫ్ట్’
చేతుల్లో సాగిన చర్మం పరిమాణం ఆధారంగా వైద్యులు, రెండు రకాల సర్జరీలను ఎంచుకుంటారు. చేతుల వరకూ సాగిన చర్మాన్ని సరిదిద్దడం కోసం ‘బ్రేఖియోప్లాస్టీ’, చేతుల నుంచి ఛాతీ గోడ వరకూ సాగిన చర్మాన్ని సరిదిద్దడం కోసం ‘ఎక్స్‌టెండెడ్ బ్రేఖియోప్లాస్టీ’ సర్జరీలను అనుసరిస్తారు. ఒకవేళ చేతుల్లో కొవ్వు ఉంటే, మొదట లైపోసక్షన్‌తో కొవ్వును తొలగించి, తర్వాత బ్రేఖియోప్లాస్టీ చేస్తారు.
తొడల కోసం ‘థై లిఫ్ట్’
తొడల్లో కొవ్వు కరిగినప్పుడు, చర్మం జారిపోయి, కదలికలు ఇబ్బందిగా మారతాయి. ఇలాంటి వాళ్లకు చేతుల మాదిరిగా తొడల్లోని అదనపు కొవ్వు, చర్మాలను తొలగించి, బిగుతుగా మలుస్తారు.
ముఖం నిగారింపు పెంచే ఫేస్ లిఫ్ట్
భారీగా బరువు తగ్గినప్పుడు ముఖంలో కొవ్వు తగ్గిపోయి, చర్మం జారిపోతుంది. యువతుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ వయసు పైబడిన మహిళల్లో చర్మం ఎక్కువగా సాగిపోయి మరింత వృద్ధుల్లా కనిపిస్తారు. ఇలాంటి వాళ్లకు ‘ఫేస్ రిజ్యువనేషన్’ మంచి ఫలితాన్నిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ముఖంలో కొవ్వు కరిగిన ప్రదేశాలను ఫిల్లర్లు లేదా కొవ్వుతో భర్తీ చేస్తారు. అలాగే సాగిపోయిన చర్మానికి థ్రెడ్ లిఫ్ట్ లాంటి టైటెనింగ్ ప్రొసిజర్స్ చేస్తారు.

చర్మం బిగువు పెంచే పరికరాలు
రేడియో ఫ్రీక్వెన్సీ సహాయంతో చర్మం బిగువు పెంచవచ్చు. అయితే వదులైన చర్మాన్ని తొలగించుకోవడం కోసం ఆశ్రయించే టమ్మీ టక్, అప్పర్ బాడీ లిఫ్ట్ తదితర సర్జరీలతో కలిపి చేయించుకోవలసిన చికిత్స ఇది. ఇలా బాడీ కాంటూరింగ్ ప్రొసిజర్స్‌తో పాటు స్కిన్ టైటెనింగ్ ప్రొసిజర్స్‌ను కలిపి తీసుకోవడం వల్ల చర్మం చక్కని బిగుతు సంతరించుకుంటుంది. ఫలితం రెట్టింపవుతుంది.
సర్జరీ తదనంతరం
వైద్యులు సూచించే కంప్రెషన్ గార్మెంట్స్ తప్పనిసరిగా వాడుకోవాలి.
వైద్యులు సూచించే మర్దనలు చేయించుకోవాలి.
బరువును స్థిరంగా ఉంచుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
పోషకాహారం తీసుకోవాలి.
స్థిరమైన బరువు కీలకం
సాగిన చర్మాన్ని తొలగించి చక్కని రూపాన్ని అందించే ఈ సర్జరీల ఫలితం సుదీర్ఘ కాలం కొనసాగాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. బరువు తగ్గకపోయినా ఫరవాలేదు. కానీ బరువు పెరగకుండా చూసుకోవాలి. సర్జరీ తర్వాత ఒకట్రెండు కిలోల బరువు పెరిగితే ఫరవాలేదు. కానీ మునుపటిలా ఎక్కువ బరువు పెరిగితే, లైపోసక్షన్ చేయని ప్రదేశాల్లో అసాధారణంగా కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి స్థిరమైన బరువును కొనసాగించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..
Read Latest Telangana News And Telugu News