Share News

మా చావుకు కోడలు కారణం కాదు

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:34 AM

తల్లి రిటైర్డ్‌ లెక్చరర్‌.. తండ్రి రిటైర్డ్‌ బ్యాంకు మేనేజర్‌.. వారికి ఇద్దరు కొడుకులు! ముచ్చటైన కుటుంబమది!

మా చావుకు కోడలు కారణం కాదు
photos

అనారోగ్య సమస్యలతోనే చనిపోతున్నామంటూ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

రాయదుర్గం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): తల్లి రిటైర్డ్‌ లెక్చరర్‌.. తండ్రి రిటైర్డ్‌ బ్యాంకు మేనేజర్‌.. వారికి ఇద్దరు కొడుకులు! ముచ్చటైన కుటుంబమది! కానీ.. ఐఐటీలో సీటు రాలేదని చిన్నకొడుకు పదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోతే.. మిగిలిన ముగ్గురూ అనారోగ్యసమస్యలతో ఇటీవలే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఉన్న గౌలిదొడ్డిలో జరిగిందీ విషాదం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పాలమూరు జిల్లా అచ్చంపేట మండలం తల్లచెరువు గ్రామానికి చెందిన బత్తుల మర్రెడ్డి(65) తన భార్య భారతి (60), కుమారుడు నిశాంత్‌రెడ్డి(38) కోడలు తేజశ్వినీరెడ్డి, మనుమడు ఆరణ్‌తేజ్‌రెడ్డిలతో పదేళ్లుగా నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ఉంటున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 17వ ర్యాంకు సాధించిన నిశాంత్‌రెడ్డి ఐఐటీ చదువు పూర్తి చేసి, ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది క్రితం నుంచి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడంతో మర్రెడ్డి కుటుంబం నానక్‌రామ్‌గూడ నుంచి గౌలిదొడ్డిలోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీకి మారారు. నాలుగు రోజుల క్రితం.. మర్రెడ్డి కోడలు తేజస్వినీరెడ్డి తన కుమారుడిని తీసుకుని మియాపూర్‌లోని తన అన్న ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి ఇంట్లో మర్రెడ్డి, అతని భార్య భారతి, కుమారుడు నిశాంత్‌ రెడ్డి ఉంటున్నారు. అంతలోనే ఏమైందో ఏమో.. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి శనివారం రాత్రి మర్రెడ్డి, ఆయన భార్య, కుమారుడు బలవంతంగా ఉసురు తీసుకున్నారు. మర్రెడ్డి తెలుగులో రాసిన ఆ సూసైడ్‌నోట్‌లో.. తమ చావుకు, కోడలు తేజశ్విని రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని, ఆరోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నామని రాసినట్టు పోలీసులు తెలిపారు. మనవడు ఆరణ్‌ తేజ్‌రెడ్డిని చక్కగా పెంచాలని కోడలిని కోరుతూ రాసిన సూసైడ్‌ నోట్‌లో కింద ముగ్గురి సంతకాలూ ఉన్నాయని వారు వెల్లడించారు.


4 నెలలుగా మెస్‌ నుంచి భోజనం..

మర్రెడ్డి కుటుంబం దాదాపు 4 నెలలుగా దగ్గరలోని మెస్‌ నుంచి రోజూ మూడు పూటలా భోజనం, అల్పాహారం తెప్పించుకునే వారని స్థానికులు తెలిపారు. రెండు రోజుల క్రితం (శనివారం) మర్రెడ్డి దంపతులు మనవణ్ని తమ ఇంటికి తీసుకొచ్చుకుని, అతడితో కొంత సమయం గడిపి సాయంత్రానికి కోడలి వద్ద దింపి వచ్చారు. ఆ రోజు రాత్రి మెస్‌ నుంచి వచ్చిన భోజనం తిన్న తర్వాత గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. తొలుత భారతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించాక.. మర్రెడ్డి, ఆయన కుమారుడు ఆమె మెడకు బిగుసుకుపోయిన తాడును తెంచి, కిందకు దింపి మంచంపై పడుకోబెట్టారని.. తర్వాత నిశాంత్‌ రెడ్డి ఉరి వేసుకుని చనిపోతే మర్రెడ్డి అతడి శరీరాన్ని కిందకి దింపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వివరించారు. ఆదివారం ఉదయం.. మెస్‌ నుంచి అల్పాహారం తీసుకొచ్చినవారు ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి గదిలోకి వెళ్లి చూసేసరికి ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం ముగ్గురి మృతదేహాలనూ మర్రెడ్డి కోడలికి అప్పగించామని పోలీసులు తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 06:34 AM