కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:32 AM
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ధర పాతాళానికి పడిపోవడంతో ఉల్లి రైతు కన్నీరు పెడుతున్నాడు.
గిట్టుబాటు ధర లేక రైతు విలవిల
పెట్టుబడులు కూడా రాని వైనం
నెలల తరబడి పొలాల్లోనే నిల్వ
పట్టించుకోని సర్కారు
మనూరు(మెదక్): ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ధర పాతాళానికి పడిపోవడంతో ఉల్లి రైతు కన్నీరు పెడుతున్నాడు. సాగు కోసం వేల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే, మార్కెట్‌లో కనీసం కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనూరు మండల పరిధిలోని రాయిపల్లి, ఉసిరికేపల్లి, దన్వార్, బోరంచ, తుమ్నూరు, రాణాపూర్ తదితర గ్రామాల్లో ఈ ఏడాది సుమారు 1200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. ఎకరాకు విత్తనాలు, ఎరువులు, కలుపు తీత, నాటు వేయడం నుంచి కోత వరకు దాదాపు 50 వేల రూపాయల వరకు ఖర్చు వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొలాల్లోనే నెలల తరబడి..
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి ధర రూ.వెయ్యి నుంచి రూ.1300 మధ్యే పలుకుతోంది. పండిన దిగుబడిని మార్కెట్‌కు తరలిస్తే రవాణా ఖర్చులు, కమీషన్లు పోను అసలు పెట్టుబడిలో సగం కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ధర పెరుగుతుందన్న ఆశతో కోత కోసిన పంటను పొలాల్లోనే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నెలల తరబడి నిల్వ ఉంచుతున్నారు. మండలంలో శీతల గిడ్డంగి సౌకర్యం లేకపోవడం రైతులకు శాపంగా మారింది. నిల్వ ఉంచిన పంట నాణ్యత దెబ్బతిని కుళ్లిపోయే ప్రమాదం ఉండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.
ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎకరాకు వేల రూపాయల కౌలు చెల్లించి సాగు చేసిన వీరు, ఇప్పుడు కౌలు డబ్బు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉల్లి పంటకు క్వింటాల్‌కు కనీసం రూ.2000 మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా పంటను నిల్వ చేసుకునేందుకు మండలంలో తగిన గిడ్డంగి సౌకర్యాలను కల్పించాలని వారు కోరుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొనుగోలుదారులకు షాక్.. పసిడి ధరలు మరింత ప్రియం
Read Latest Telangana News and National News