Share News

నేపాల్ ఎన్నికల్లో దూసుకెళ్తున్న ఆర్ఎస్పీ.. ప్రధానిగా బాలెన్ షా?

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:15 AM

నేపాల్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరనుందా? కొత్త ప్రధాని ఎన్నిక లాంఛనమేనా? ఆ దేశంలో నవశకం ఆరంభం కాబోతుందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల్లో ఆర్ఎస్పీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తుండటమే ఇందుకు కారణం. వివరాల్లోకెళితే...

నేపాల్ ఎన్నికల్లో దూసుకెళ్తున్న ఆర్ఎస్పీ.. ప్రధానిగా బాలెన్ షా?
SP leader Balendra Shah

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ రాజకీయం సంచలనం దిశగా ముందడుగేస్తోంది. ఆ దేశంలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ రాపర్, మాజీ మేయర్ బాలేంద్ర షా(బాలెన్)కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్ఎస్పీ) క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను కాదని.. నవతరం వైపు మొగ్గు చూపుతున్నారు నేపాలీలు. మొత్తం 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో బాలెన్ నేతృత్వంలోని ఆర్ఎస్పీ అధికారం చేపట్టనుంది. ఇదే జరిగితే.. హిమాలయ దేశ తదుపరి ప్రధానమంత్రిగా బాలేంద్ర షా నియమితులవడం ఖాయం కానుంది.


గతేడాది సెప్టెంబర్లో జెన్ జీ(Gen Z) యువత చేపట్టిన భారీ ఆందోళనల నేపథ్యంలో నాటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో పార్లమెంట్ రద్దైన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల అనంతరం జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ రేపింది. సంప్రదాయ రాజకీయ పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్, మావోయిస్టు సెంటర్లపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆర్ఎస్‌పీకి అనుకూలంగా మారింది. ముఖ్యంగా ఆ దేశ రాజధాని ఖాట్మండులో ఆర్ఎస్‌పీ మద్దతుదారులు గంట(ఆర్ఎస్పీ గుర్తు) మోగిస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.


275 పార్లమెంటరీ స్థానాలకు గానూ.. 165 స్థానాల్లో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆర్ఎస్‌పీ ఇప్పటివరకు 29 స్థానాలను కైవసం చేసుకోగా.. మరో 93 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. బాలేంద్ర షా.. తన ప్రత్యర్థి, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై ఆయన సొంతగడ్డ అయిన ఝాపా-5 నియోజకవర్గంలో 15 వేల ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. ఆర్ఎస్‌పీ అధ్యక్షుడు రబీ లామిచానే చిత్వాన్-2 స్థానం నుంచి 54,402 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ విజయం సాధించారు.


నేపాల్ ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం.. మార్చి 9 నాటికి ఈ ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాలతో పాటు, మిగిలిన 110 స్థానాలను దామాషా పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అవినీతి, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతోన్న హిమాలయ దేశంలో బాలెన్ షా రాకతో నూతన శకం ఆరంభమవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే తన పాటలతో వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన బాలెన్.. ఇప్పుడు ప్రధానిగా దేశ గమనాన్ని ఎలా మారుస్తారో చూడాలి.


ఇవీ చదవండి:

బెంగాల్‌లో ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా

టీవీ న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రిపోర్టింగ్‌పై కేంద్రం నిషేధం

Updated Date - Mar 07 , 2026 | 11:19 AM